
వాతావరణ లెక్కల్ని మరింత పక్కాగా ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్ ) సిద్ధమవుతోంది. అధునాతన పద్ధతిలో వెదర్ స్టేషన్లను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 832 వెదర్ స్టేషన్లు ఉండగా వాటిని దశలవారీగా 924కు పెంచింది. వచ్చే నెలలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 120 వెదర్ స్టేషన్లను ప్రారంభించనుంది. దీంతో వీటి సంఖ్య1044కు చేరనుంది. ముఖ్యంగా రానున్న వర్షాకాలంలో వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందించేందుకు ఇప్పటినుంచే అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎంత ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయో గంట, గంటకు ఎల్‌ఈడీ డిస్ ప్లే బోర్డులు, యాప్ ద్వారా ప్రజలకు, వివిధ నివేదికల ద్వారా ప్రభుత్వానికి, వాతావరణ శాఖకు టీఎస్ డీపీఎస్ సమాచారం ఇస్తోంది. ఉష్ణోగ్రతలు, వర్షపాతం వివరాలను కలెక్టర్ ఆఫీసుల్లో డిస్ ప్లే చేస్తున్నారు. హైదరాబాద్‌లో సచివాలయం, ఖైరతాబాద్‌లోని టీఎస్‌డీపీఎస్ ఆఫీసుల్లోనూ డిస్ ప్లే బోర్డులున్నాయి. వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, గాలి వేగం, గాలి దిశలు వంటి సమాచారమూ ఇస్తున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెదర్ స్టేషన్లలో రెయిన్ గేజ్ బకెట్లను తనిఖీ చేస్తున్నారు. వెదర్ స్టేషన్లను ఏర్పాటుకు రూ.1.20 లక్షల ఖర్చవుతుందని టీఎస్ డీపీఎస్ ఏఈవో వేణుగోపాల్ తెలిపారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లలోనే వీటిని ఏర్పాటు చేశామన్నారు. ఒక్క వెదర్ స్టేషన్ ద్వారా 12 కిలోమీటర్ల పరిధి సమాచారాన్ని తీసుకోవచ్చని ఆయన చెప్పారు.
రైల్వే స్టేషన్లలో డిస్‌ప్లే బోర్డులు
వెదర్ స్టేషన్ల ద్వారా వస్తున్న సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు త్వరలో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంతాల్లో డిస్‌ప్లేకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టీఎస్ డీపీఎస్ సీఈఓ షేక్ మీరా అలీ తెలిపారు. ప్రయాణికులకు వర్ష సమాచారం తెలియజేయడం ద్వారా వెళ్లాలనుకున్న ప్రాంతానికి వెళ్లాలా వద్దా నిర్ణయించుకుంటారన్నారు.
వ్యవసాయ శాఖకు కీలక సమాచారం
టీఎస్ డీపీఎస్ సమాచారం వ్యవసాయ శాఖకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు బాగా ఉపయోగపడుతోంది. ఎక్కువ , తక్కువ, మీడియం వర్షాలు కురుస్తున్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా పంటల సాగుపై అధికారులు అంచనాకు రావొచ్చు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకానికి ఈ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. టీఎస్‌డీపీఎస్ సమాచారం 83 శాతం కరెక్టుగా ఉంటోంది.