కరోనాను గాలికొదిలేసి.. కలెక్టర్లకు వేరే టార్గెట్లు

కరోనాను గాలికొదిలేసి.. కలెక్టర్లకు వేరే టార్గెట్లు

వెలుగు, నెట్వర్క్:  రెండు వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. జిల్లాల్లోనూ ఈ మూడురోజుల నుంచి ఎక్కువయ్యాయి. ఎక్కువ టెస్టులు లేక, రిపోర్టులు తొందరగా రాక, ట్రీట్​మెంట్​ సరిగ్గా అందక జనం ఇబ్బంది పడుతున్నారు. కరోనా డేంజర్​ బెల్స్​ మోగుతున్న ఇలాంటి టైంలో.. ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? దాని కట్టడికి చర్యలు తీసుకుంటుంది. అవసరమైన సౌలతులు కల్పిస్తుంది. మహమ్మారి నివారణ, నియంత్రణ బాధ్యతలను అధికారులకు అప్పగిస్తుంది. కానీ, రాష్ట్ర సర్కార్​ మాత్రం దానిని పక్కనపెట్టి శ్మశానవాటికలు, డంప్​యార్డులు, విలేజ్​ పార్కులు, రైతు వేదికలకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా కలెక్టర్లకు శ్మశానవాటికలపై టార్గెట్​ పెట్టింది. దాంతో పాటు మిగతా పనులు పూర్తి చేసేందుకు డెడ్​లైన్​ పెట్టింది. దీంతో ఆ టార్గెట్​ను అందుకునేందుకు కలెక్టర్లు ఊళ్లు పట్టుకు తిరుగుతున్నారు. పనులు అనుకున్నట్టు సాగుతున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. కాని చోట సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వారికి కరోనాపై రివ్యూ చేసేందుకూ టైం దొరకట్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పనుల మీద పనులు

పల్లె ప్రగతిలో భాగంగా ఊరూరా శ్మశానవాటిక, డంపుయార్డు నిర్మించాలని సర్కార్​ భావించింది. జూన్​ చివరికల్లా టార్గెట్​ చేరుకోవాలని కలెక్టర్లకు డెడ్​లైన్​ పెట్టింది. అయితే, చాలా పల్లెల్లో ప్రభుత్వ భూములు లేకపోవడం, వేరే సమస్యలతో ఆ లక్ష్యం చేరలేదు. దీంతో ఆ డెడ్​లైన్​ను ఆగస్టు15కు పొడిగించారు. కొన్ని జిల్లాల్లో ఆగస్టు 30 వరకూ టైం ఇచ్చారు. వర్షాకాలం మొదలవడంతో జూన్​ 25 నుంచే హరితహారం కింద మొక్కలు నాటే లక్ష్యం పెట్టారు. దీంతో వారం పదిరోజులు కలెక్టర్లకు దాంతోనే సరిపోయింది. ఆ పనులు జరుగుతుండగానే ఊరూరా ఎకరం విస్తీర్ణంలో ‘ప్రకృతి వనం’ పేరిట నేచర్​ పార్కునూ ఏర్పాటు చేయాల్సిందిగా వాళ్లకు సర్కారు నుంచి ఆదేశాలు అందాయి. రైతుల శిక్షణ, సమావేశాల కోసం దసరానాటికి రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని ఇంకో టార్గెట్​ పెట్టింది. పనులపై పై అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్​ చేస్తుండడంతో కలెక్టర్లు రోజూ గ్రామాల్లో తిరిగి పనులను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శ్మశానవాటికలు, డంప్​యార్డులకే కలెక్టర్లు ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న సర్పంచులు, కార్యదర్శులు, ఇతర స్టాఫ్​కు షోకాజ్​లు ఇస్తున్నారు. అవసరమైతే సస్పెండ్​ కూడా చేస్తున్నారు.

మొదట్లో అంతా కరోనాపైనే

నిజానికి మొదట్లో కరోనాను కలెక్టర్లు సీరియస్​గానే తీసుకున్నారు. ట్రేసింగ్​, టెస్టింగ్​, ట్రీట్​మెంట్​ పాలసీని పక్కాగా ఫాలో అయ్యారు. పాజిటివ్​ వచ్చిన వారిని గాంధీ హాస్పిటల్​కు, వాళ్లను కాంటాక్ట్​ అయినోళ్లను ట్రేస్​ చేసి జిల్లాల్లోని గవర్నమెంట్​ క్వారంటైన్​ సెంటర్లకు తరలించారు. కరోనాను చాలావరకు కంట్రోల్​ చేశారు. ఒకదశలో రెడ్​ జోన్​ జిల్లాలను ఆరెంజ్​, గ్రీన్​జోన్లుగా మార్చేందుకు పోటీపడి మరీ పనిచేశారు. కానీ, సర్కార్​ టెస్టులు తగ్గించడం, జిల్లాల బులెటిన్లపై నియంత్రణ పెట్టడం, క్వారంటైన్​ సెంటర్లను ఎత్తేయడం, టెస్టులు ఎక్కువ చేసిన కలెక్టర్లపై సర్కార్​ సీరియస్​ అయిందన్న వార్తలు రావడంతో ఆఫీసర్లు డీలా పడ్డారు. వారికి కరోనా పనులు కాకుండా సర్కారు వేరే టార్గెట్​లు పెట్టడంతో కరోనా కట్టడి దాదాపు అటకెక్కేసింది.

టెస్టుల్లేవ్.. ట్రేసింగూ లేదు

జిల్లాల్లో టెస్టింగ్​, ట్రేసింగ్​, ట్రీట్​మెంట్​లు సరిగ్గా జరగట్లేదు. క్వారెంటైన్​ సెంటర్లు ఎత్తేశారు. పాజిటివ్​ వచ్చిన వ్యక్తులనూ ఇంటికే (హోమ్​ ఐసోలేషన్​) పరిమితం చేస్తున్నారు. వాళ్ల ద్వారా ఇంటోళ్లకు వైరస్​ సోకుతున్నా పట్టించుకునేవాళ్లు లేరు. చాలాచోట్ల హోంఐసోలేషన్​లో ఉన్నోళ్లు ఆక్సిజన్​ అందక చనిపోతున్నా చర్యలు తీసుకున్నది లేదు. చాలా జిల్లాల్లో కరోనా ల్యాబులు పెట్టినా చిన్నచిన్న పరికరాలూ లేక టెస్టులు చెయ్యట్లేదు. ఉదాహరణకు మెదక్​ జిల్లాలో ల్యాబ్​​ఏర్పాటుచేసినా ఒక కూలింగ్​ ప్లాస్క్​ లేక అక్కడ టెస్టులు చేయలేని పరిస్థితి. అన్ని జిల్లాల నుంచి శాంపిళ్లను హైదరాబాద్​లోని ఆస్పత్రులతో పాటు వరంగల్​ ఎంజీఎంకు పంపిస్తుండడంతో రిపోర్టులు రావడానికి నాలుగైదు రోజులు పడుతోంది. ఆలోపు కరోనా ఉన్నోళ్ల నుంచి వేరేవాళ్లకూ అది అంటుతోంది. దీంతో జిల్లాల్లో ఇప్పటికే కేసులు పెరిగిపోతున్నాయి. పోయిన మూడు రోజుల్లో హైదరాబాద్​ను మించి జిల్లాల్లోనే 2,500 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వారియర్స్​ డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్​ స్టాఫ్​ వైరస్​ బారిన పడుతున్నారు. దీంతో జిల్లాల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వరంగల్​ ఎంజీఎం, ఖమ్మం, నిజామాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్​కర్నూల్​ వంటి అనేక ఆస్పత్రుల్లో ఇలాంటి సమస్యే ఉంది. నిజామాబాద్​ జీజీహెచ్​లో ఈ నెల 10న ఆక్సిజన్​ అందక నలుగురు చనిపోయారు. దీనిపై కలతచెంది, అక్కడి సూపరింటెండెంట్​ రిజైన్​ చేస్తున్నట్టు ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్​ సెలవుపై వెళ్లారు. సిద్దిపేటలో డీఎంహెచ్​వో ఆఫీసును ఓ రోజంతా మూసేశారు. పరిస్థితి ఇంత సీరియస్​గా ఉన్నప్పుడు కరోనా కట్టడికి కలెక్టర్ల సేవలను  పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వం, వారికి శ్మశానవాటికలు, డంపుయార్డల టార్గెట్లు పెట్టి, ఊళ్లు తిప్పుతుండడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

డ్రైనేజీ లోపాలే ఉస్మానియాను ముంచింది