
హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీని ప్రభుత్వం ఒక్కరోజుతోనే సరిపెట్టింది. కేవలం ఐదు జిల్లాల్లో మొక్కుబడిగా పంపిణీ చేపట్టిన పశుసంవర్ధకశాఖ ఆ తర్వాత ముఖం చాటేసింది. సెప్టెంబర్ 25 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రంలోని మేడ్చల్, భూపాలపల్లి, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గొర్రెల పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాకు ఆరు యూనిట్ల చొప్పున 30 యూనిట్లను పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పొలిటికల్‌గా లబ్ధిపొందేందుకు అదే నియోజకవర్గంలో ప్రారంభించాలని అధికార పార్టీ భావించిందని విమర్శలు వచ్చాయి. సెప్టెంబరు 21న ఎన్నికల కోడ్ రావడంతో హుజూర్‌నగర్‌లో పంపిణీపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. కోడ్ నేపథ్యంలో సూర్యపేట జిల్లా మినహా మిగతా జిల్లాల్లో గొర్రెల పంపిణీ చేపట్టాల్సి ఉన్నా కేవలం ఐదు జిల్లాల్లో పంపిణీ చేపట్టి ‘మమ’ అనిపించింది.
ఇంకా 600 కోట్లు ఉన్నయ్
మొదటి విడత పంపిణీ కోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) నుంచి పశుసంవర్ధకశాఖ రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది. ఇందులో ఇప్పటి వరకు రూ.3,400 కోట్లు ఖర్చు చేసి 3,65,682 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మొదటి విడత ఖర్చు పోగా ఇంకా మరో రూ.600 కోట్లకు పైగా నిధులు మిగిలే ఉన్నాయి. ఈ ఫండ్స్‌తో మరో 64 వేల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ నిధులను ఖర్చు చేసి లెక్కలు చూపిస్తే కానీ రెండో విడత కోసం ఎన్‌సీడీసీ రుణాలు అందించే అవకాశం లేదు. 25వేల మందికిపైగా గొల్లకురుమలు డీడీలు తీసి రూ.80 కోట్లు ప్రభుత్వానికి చెల్లించారు. ఒక్కో యూనిట్‌కు లక్షా 25వేల రూపాయలు అవుతుండగా, లబ్ధిదారులు తమ వాటాగా రూ.31,250 చొప్పున చెల్లించి ఎదురుచూస్తున్నారు
రెండో విడతకు మరో రూ.4 వేల కోట్లు అవసరం
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా 7,29,067 యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 3,65,712 యూనిట్లు మాత్రమే పంపిణీ చేసింది. ఇంకా 3,63,355 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. రెండో దశ చేపట్టాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయని పశుసంవర్థశాఖ అంచనా వేస్తోంది. రెండో విడత కోసం డీపీఆర్‌ను సిద్ధం చేసిన అధికారులు.. ఇప్పటికీ ఎన్‌సీడీసీకి ఇవ్వలేదని తెలుస్తోంది. మొదటి విడతలో మిగిలిన నిధులు ఖర్చు చేస్తేనే రెండో విడుత రుణాల కోసం ఎన్‌సీడీసీని సంప్రదించే అవకాశం ఉంది.
పథకం వివరాలివీ..
గొర్రెల పంపిణీ కోసం ఎన్‌సీడీసీ వద్ద
ప్రభుత్వం తీసుకున్న రుణాలు రూ.4,000 కోట్లు
ఖర్చు చేసిన నిధులు రూ.3,400
మిగిలిన నిధులు రూ.600 కోట్లు
డీడీలు కట్టిన లబ్ధిదారులు 25 వేల మంది
మొత్తం లక్ష్యం 7,29,067 యూనిట్లు
ఇచ్చింది 3,65,712 యూనిట్లు
ఇవ్వాల్సింది 3,63,355 యూనిట్లు