వడ్లు రోడ్ల మీదనే..నెలన్నరైనా సగం కూడా కొనని సర్కార్

వడ్లు రోడ్ల మీదనే..నెలన్నరైనా సగం కూడా కొనని సర్కార్

నిజామాబాద్ జిల్లా మాల్కాపూర్​, నర్సింగ్​పల్లి, అర్గుల్​.. ఆ ఊళ్లలో రోడ్ల పొంట ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే. ఏ కళ్లంలో చూసినా ధాన్య రాశులే. వాటిని ఆరబోస్తూ కొందరు.. జల్లెడ పడుతూ ఇంకొందరు.. ఇలా రైతులు ఆ కుప్పల దగ్గరే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఆ ధాన్యాన్ని చూస్తే ఎవరికైనా సంతోషం కలగక మానదు. కానీ, రైతులకు మాత్రం పంట పండిందన్న ఆనందం కూడా లేకుండా పోయింది.

మహబూబా​బాద్​ జిల్లా సోమారం.. అక్కడ కూడా దారి పొడవునా ధాన్య రాశులే. కళ్లాల్లోనూ తళ తళ మెరుస్తున్న వడ్ల కుప్పలే. కానీ, వాటిని పండించిన రైతులు భయపడాల్సి వస్తున్నది. ఇంత మబ్బులు పట్టి మొగులైనా.. చిన్న చినుకులు పడినా.. కలవరపడాల్సి వస్తున్నది. ఎక్కడ వడ్లు తడిసిపోతాయోనని ఆందోళన చెందాల్సి వస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు మొదలుపెట్టి నెలన్నర కావస్తున్నా.. ఇప్పటివరకు సగం వడ్లు కూడా కొనలేదు. సుమారు యాభై, అరవై  లక్షల టన్నుల వడ్లు ఇంకా రోడ్లపైనే, కళ్లాల్లోనే ఉన్నాయి. కొనుగోళ్లలో ఆలస్యం.. తాలు పేరిట దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో రైతులకు పంట కొనుగోలు కష్టాలు తీరడం లేదు. చాలా ఊళ్లల్లో వడ్లను అమ్మేందుకు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వడ్లు కాంటా అయి పది రోజులైనా మిల్లులకు చేరడం లేదు. ఈ సీజన్‌లో కోటి 5లక్షల టన్నుల వడ్లు మార్కెట్​కు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆ మొత్తం కొంటామని ప్రకటించి.. కొనుగోళ్లు మొదలుపెట్టింది. అలా కొనుగోళ్లు ప్రారంభించి నెలన్నర రోజులవుతోంది. ఇప్పటివరకు 44 లక్షల టన్నుల వడ్లను మాత్రమే కొన్నది. మిగతా సుమారు 60 లక్షల టన్నుల వడ్లను కొనడానికి ఇంకా ఎంత టైం పడుతుందో తెలియని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,344 కొనుగోలు సెంటర్లను ప్రారంభించగా.. వీటిలో కొన్ని మూతపడ్డాయి.  నాట్లు ఆలస్యంగా వేసిన వరంగల్‌ రూరల్‌ జిల్లాతోపాటు కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పడే కోతలు పూర్తయి వడ్లు మార్కెట్‌కు వస్తున్నాయి. అలాంటి వాటిని ఎప్పుడు కొంటారన్నది కూడా ప్రశ్నగా మారింది.

కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లను మిల్లులకు తరలించేందుకు ఇచ్చే ఆర్డర్‌‌ ఫామ్‌‌ను డీఎస్‌‌వోలు సకాలంలో ఇవ్వకపోవడంతో సెంటర్లకు లారీలు రావడం లేదు. కొన్ని చోట్ల మిల్లులు, కొనుగోలు సెంటర్లు చాలా దూరంలో ఉండటం, లేబర్​ కొరత కారణంగా లోడింగ్‌‌ అన్‌‌లోడింగ్​కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టైమ్​కు లారీలు రాక సెంటర్లలో ధాన్యం రోజుల తరబడి  అక్కడే ఉంచే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు, సెంటర్ల నిర్వాహకులకు మధ్య లొల్లులు జరుగుతున్నాయి. లారీల అంశం తమ చేతుల్లో లేదని, అవి వస్తే  తామే చెప్తామని సెంటర్ల నిర్వాహకులు రైతులకు చెబుతున్నారు. లారీల్లో లోడు వెళ్లే దాకా వడ్లకు సంబంధించి ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదు. పైగా లారీల్లో లోడ్​ అయ్యేదాకా వడ్లకు  ఏం జరిగినా రైతులదే బాధ్యత అంటున్నారు. దీంతో రైతులు వడ్ల కుప్పల దగ్గరే పడిగాపులు కాయాల్సి వస్తోంది. మొగులైతే చాలా.. ఎక్కడ వాన పడి వడ్లు తడిసిపోతాయోనని భయపడాల్సి వస్తోంది.

లారీ లోడులో ఐదు బస్తాలు కట్‌‌!

తాలు పేరిట కొందరు మిల్లర్లు రైతులను ముంచుతున్నారు. తేమ 17 శాతానికి మించొద్దన్న అధికారుల సూచన మేరకు కొనుగోలు సెంటర్లలో నిర్వాహకులు.. తాలు, తరుగు అంటూ క్వింటాల్‌‌ వడ్లలో మూడు నుంచి నాలుగు కిలోలు తీసేస్తున్నారు. వాటిని లారీల్లో మిల్లులకు చేర్చగా..  అక్కడ కొందరు మిల్లర్లు లోడ్‌లోని కొన్ని బస్తాల్లో తాలు చెక్‌‌ చేసి 300 క్వింటాల్‌‌ ఉండే లారీ లోడ్‌లో ఐదు నుంచి ఆరు బస్తాలు తరుగు కట్‌‌ చేస్తున్నారు. దీంతో లోడ్‌లో ఏ రైతు ధాన్యంలో తాలున్నా మిగతా రైతుల వడ్లలో కూడా కోత పడుతున్నది. ఒకవైపు కొనుగోలు సెంటర్ల వద్ద కాంటా దగ్గర, మరోవైపు మిల్లర్ల వద్ద.. ఇలా రెండు విధాలుగా రైతులు నష్టపోతున్నారు. క్వింటాల్‌‌కు ఆరేడు కిలోలు కోత పడుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ప్రారంభించిన కొన్నిరోజులకే కొనుగోళ్లు పూర్తయ్యాయని సెంటర్లను మూసివేస్తున్నారు. వరంగల్​ రూరల్​, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కొన్ని ప్రాంతాల్లో వడ్లు కొన్నా టైమ్​కు రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంలేదు.

కొనుగోళ్లు పూర్తయ్యేదెప్పుడు?

రాష్ట్రంలో ఇప్పటి వరకు నల్గొండ జిల్లా ఎక్కువగా 5 లక్షల 97వేల టన్ను వడ్లు కొన్నారు. నిజామాబాద్‌‌లో 4.07 లక్షలు, సూర్యాపేటలో 3.20 లక్షలు, ఖమ్మంలో 2.90 లక్షలు, జగిత్యాలలో 2.50 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. అతి తక్కువగా 200 టన్నుల వడ్లు ఆదిలాబాద్​ జిల్లాలో కొన్నారు. ఇలా రాష్ట్రంలో 32 జిల్లాల్లో ఇప్పటివరకు 44.13 కోట్లు వడ్లు కొనుగోలు చేశారు. సర్కారు కోటి 5 లక్షల టన్నులు ధాన్యం మార్కెట్‌‌కు వస్తుందని, పంట మొత్తం కొంటామని గతంలో ప్రకటించింది. కొనుగోళ్లు ప్రారంభించి నెలన్నర రోజులవుతుంటే.. లక్ష్యంలో సగం వరకు కూడా కొనుగోళ్లు పూర్తికాలేదు. మరో పదిహేను 20 రోజుల్లో వర్షాకాలం మొదలువుతుంది.అప్పటిలోపే మొత్తం ధాన్యం కొనాల్సి ఉంది.

కాంటా పెట్టిన్రు.. లారీలు రాలే

వారం కింద వడ్లు కాంటా పెట్టిన్రు. లారీలు వస్తలేవు. లారీలో లోడ్‌‌ అయినంకనే రశీదు ఇస్తమని సెంటరోళ్లు చెప్పిండ్రు. ఇప్పటికే బస్తాకు కిలోన్నర కట్‌‌ చేసిన్రు. మిల్లుకు పోతే తాలు పేరుతో ఎంత కట్ చేస్తరోనని భయమైతున్నది.

– సుమతి, మహబూబాబాద్‌‌ జిల్లా

17 రోజులైనా కాంటా పెట్టలే

మూడెకరాల్లో పండిన వడ్లను సెంటర్​కు తెచ్చి  17 రోజులైంది. ఇంకా వడ్లు కాంటా పెడతలేరు. పొద్దున ఆరబెడ్తున్నం, సాయంత్రం కుప్ప చేస్తున్నం. ఎప్పుడు వాన పడ్తుందోనని భయపడుతూ గడుపుతున్నం. కనీసం కవర్లన్నా ఇస్తలేరు.

– రాస నర్సయ్య, మొగుళ్లపల్లి, భూపాలపల్లి జిల్లా

15 రోజులైంది పైసలు పడలే

వడ్లు అమ్మి 15 రోజులైంది. ఇప్పటిదాకా పైసలు బ్యాంకుల పడలే. మూడు నాలుగు రోజుల్లో పడుతయన్నరు. ఇప్పటికీ రాలే.  వానాకాలం సీజన్‌ దగ్గర పడతాంది. విత్తనాలు కొనడానికి ఇబ్బంది పడుతున్నం.

– వెంకన్న, నెల్లుకుదురు మండలం, మహబూబాబాద్​ జిల్లా

లారీలొస్తలేవంటున్నరు..

రెడ్లరేపాకలోని ఐకేపీ సెంటర్ కు వడ్లు తీసుకొచ్చి 25 రోజులైంది. రైస్ మిల్లులకు పోయిన లారీలు ఆన్ లోడ్ చేస్తలేరని, లారీలు వచ్చే దాక కొనేది లేదని చెప్తున్నరు. ఇంకెన్ని రోజులు ఆగల్నో తెలుస్తలేదు.

– దాసరి శ్రీను, దాసిరెడ్డి గూడెం, వలిగొండ

పది రోజుల్నుంచి ఇక్కడ్నే 

వడ్లు అమ్మేందుకు పది రోజులనుంచి సెంటర్ దగ్గర పడిగాపులుపడ్తున్న. మూడెకరాల్లో పండించిన వడ్లు తెచ్చి పదిరోజులైతుంటే.. రెండు రోజుల కింద గన్నీ బ్యాగులు ఇచ్చిన్రు. తేమ శాతం సరిగా ఉన్నా  కాంటాలు వేయలేదు. మబ్బులు పడుతుండంతో ఆరబోసిన వడ్లను కుప్ప చేయడం, ఎండ రాగానే  ఆరబెట్టడం చాలా  కష్టంగా ఉంది.

– కొడారి రాజయ్య, రంగయ్యపల్లి, భూపాలపల్లి జిల్లా

సమ్మె చేశారని డ్యూటీలోకి రానిస్తలేరు