సంప్రదాయ సంకీర్తనోత్సవాలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్ లో 16 రోజుల పాటు సాగిన ఉత్సవాలు వివిధ గాయకులు, కళాకారుల ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. చివరి రోజు ప్రముఖ కర్ణాటక సంగీత గాయని అమృత వెంకటేష్ తన గాత్రంతో అలరించారు.
అద్భుతమైన సృజనాత్మక సమయస్ఫూర్తితో సాహిత్యం, భావాన్ని మేళవిస్తూ ఆమె చేసిన గాత్రం కళాపిపాసులను కట్టిపడేసింది. ఉత్సవాల చివరిరోజైన ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రదర్శన ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతి కలిగించింది.
అమృత వెంకటేశ్ అద్భుత ప్రదర్శనకు దక్షిణ భారత కళాకారుల సంగీత వాయిద్యాలు తోడవ్వడంతో ముగింపు ఉత్సవం విజయవంతం అయినట్లు ఈశ్వర్ ప్రసాద్, జె.ఎస్.శ్రీరామ్ తెలిపారు. వయోలిన్ విద్వాంసులు బాంబే ఆర్. మాధవన్, మృదంగం విద్వాంసులు అర్జున్ గణేష్, ఘటం విద్వాంసులు చంద్రశేఖర శర్మ మొదలైన విద్వాంసుల వాయిద్యాల కలయికతో కచేరి అద్భుతంగా సాగిందని కొనియాడారు. ఈ కళాకారులందరూ కలిసి అత్యుత్తమ సంగీత కచేరీని ప్రదర్శించి అభిమానుల ప్రశంసలు అందుకున్నారని ప్రశంసించారు.
►ALSO READ | ఇతనికి సంక్రాంతి ఆనందం లేకుండా పోయింది.. హైదరాబాద్లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట రూ.27 లక్షల మోసం
ఈ ముగింపు ఉత్సవంలో ప్రముఖ సంగీతకారులు మోదుముడి సుధాకర్, కృతి విఠల్, సవితా శ్రీరామ్, లతాంగి సిస్టర్స్ అర్చన-సమన్వి, జె.ఎస్. శ్రీరామ్, సింహాచల్ శాస్త్రి, అరవింద్, కమలకిరణ్ వింజమూరి, అభిషేక్ రఘురామ్, టి.ఎం. కృష్ణ, అమృత వెంకటేష్ మొదలైన ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
ఉత్సవాల చివరి రోజు కళాకారులకు సన్మాన, సత్కార కార్యక్రమం నిర్వహించారు. హోప్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు కే.ఎస్ రావు,కే.సునీత కళాకారులను సత్కరించారు. సంప్రదాయ సంకీర్తనోత్సవ్ 2026 విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన కళాకారులు, స్వచ్ఛంద సేవకులు, స్పాన్సర్లు, మద్దతుదారులందరికీ ఈశ్వర్ ప్రసాద్, జె. ఎస్. శ్రీరామ్ తజ్ఞతలు తెలిపారు.
