OTT MOVIES..ఫ్యామిలీ అంతా ఒకేసారి!?

OTT MOVIES..ఫ్యామిలీ అంతా ఒకేసారి!?

నిఘా కళ్లకు దొరుకుతుందా?

టైటిల్​ : ఖూఫియా

డైరెక్టర్​ : విశాల్​ భరద్వాజ్​

కాస్ట్​ : టబు, అలీ ఫజల్​, వామికా గబ్బి

లాంగ్వేజ్​: హిందీ

ప్లాట్​ ఫాం : నెట్​ ఫ్లిక్స్​

కృష్ణ మెహ్రా (టబు).. జీవ్ ( ఆశిష్ విద్యార్థి) ‘రా’ అధికారులు. ఢిల్లీలోని ‘రా’ ప్రధాన కార్యాలయంలో రవి మోహన్ (అలీ ఫజల్) డెస్క్ జాబ్ చేస్తుంటాడు. అతని తల్లి లలిత (రవీంద్ర బెహెల్) భార్య చారూ (వామికా గబ్బీ) కొడుకు కునాల్.. ఇది అతని ఫ్యామిలీ. ఇక కృష్ణ మెహ్రా విషయానికి వస్తే, ఆమె తన భర్త శశాంక్ (అతుల్ కులకర్ణి) నుంచి విడాకులు తీసుకుని ఒక్కతే ఉంటుంది. వాళ్ల సంతానమే విక్రమ్. తన కొడుకు కోసం టైం ఇవ్వలేకపోతున్నా అనే అసంతృప్తి ఆమెను వెంటాడుతుంటుంది. 

అదే టైంలో బ్రిగేడియర్ మీర్జా .. ఉగ్రవాదులతో చేతులు కలిపి, దేశ రహస్యాలను  శత్రు దేశాలకు చేరవేస్తుంటాడు. అతనికి సంబంధించిన ఆపరేషన్​లో కృష్ణ మెహ్రా స్నేహితురాలు హీనా రెహ్మాన్ పాల్గొంటుంది. మీర్జా ప్రాణాలు తీయాలనే లక్ష్యంతోనే ఆమె అతని బర్త్ డే వేడుకకి హాజరవుతుంది. కానీ రవి మోహన్​ ఆ విషయం లీక్​ చేయడంతో హీనా రెహ్మాన్ ప్రాణాలు కోల్పోతుంది.  

ఈ సమాచారం ‘రా’ అధికారి జీవ్ దృష్టికి వెళుతుంది. అతని ఆదేశంతో కృష్ణ మెహ్రా తన టీంతో రంగంలోకి దిగి రవిమోహన్ కదలికలపై నిఘా పెడుతుంది. రవి మోహన్ చేస్తున్న పనులు అతని భార్యకు తెలియవనే విషయం వాళ్లకు అర్థమవుతుంది. కానీ ప్రతి సోమవారం రవి మోహన్ ఇంట్లోకి నేరుగా వెళ్లకుండా ముందుగా గ్యారేజ్​కి వెళ్లి .. ఆ తరువాత ఇంట్లోకి వెళ్లడం జీవ్​కి అనుమానం కలిగిస్తుంది. 

దాంతో కృష్ణ మెహ్రా టీం గ్యారేజ్​లో సీక్రెట్ కెమెరాలు పెడతారు. కృష్ణ మెహ్రా వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా? శత్రు దేశాలతో చేతులు కలిపిన బ్రిగేడియర్ మీర్జా పరిస్థితి ఏమిటి? అమర్ భూషణ్ రచించిన 'ఎస్కేప్ టు నో వేర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ తరహా కంటెంట్​కి ఉండవలసిన స్పీడ్.. ఈ కథలో కనిపించదు. అలాగే ఎలాంటి ట్విస్టులు లేకుండా నడిచే సాదా సీదా స్క్రీన్ ప్లే మైనస్​. ఇది సినిమాలా కాకుండా వెబ్ సిరీస్​లా ఉంది.
 

ఫ్యామిలీ అంతా ఒకేసారి!?

టైటిల్ : ది గ్రేట్​ ఇండియన్​ సూసైడ్​

డైరెక్టర్​ : విప్లవ్​ కోనేటి​

కాస్ట్​ : హెబ్బా పటేల్, రామ్ కార్తీక్, పవిత్రా లోకేష్, నరేష్, విజయకృష్ణ, బబ్లూ

లాంగ్వేజ్​ : తెలుగు, ప్లాట్​ ఫాం: ఆహా​

హేమంత్ (రామ్ కార్తీక్) అనాథ. సొంతంగా కాఫీ షాప్ నడుపుతుంటాడు. చైత్ర (హెబ్బా పటేల్) ఇంట్లో తయారుచేసిన కుకీస్ సప్లయ్​  చేస్తుంటుంది. ఆమెతో హేమంత్ ప్రేమలో పడతాడు. ఒక రోజు ప్రపోజ్ చేస్తాడు. హేమంత్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ చైత్ర ‘నో’ అంటుంది. కుటుంబ సభ్యులందరూ కొన్ని రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోబోతున్నామని చెప్పడంతో షాక్​ అవుతాడు హేమంత్​. ఫ్యామిలీ అంతా సూసైడ్ ఎందుకు ప్లాన్ చేశారు? దీని వెనుక చైత్ర పెదనాన్న నీలకంఠం (సీనియర్ నరేష్) పాత్ర ఏమిటి? నరేష్ భార్యగా నటించిన పవిత్రా లోకేష్, ఇతర కుటుంబ సభ్యుల పాత్రలు ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే గ్రేట్​ ఇండియన్​ సూసైడ్​​ చూడాలి.

వరదల నేపథ్యంలో...

టైటిల్ : ముంబై డైరీస్ సీజన్ –2

డైరెక్టర్​ : నిఖిల్ అద్వానీ​

కాస్ట్​ : మోహిత్ రైనా, కొంకణ సేన్ శర్మ, శ్రేయ ధన్వంతరి, నటాషా భరద్వాజ్, ప్రకాష్ బెలవాడి, సత్యజిత్ దూబే

లాంగ్వేజ్​ : హిందీ

ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో​

ముంబై పేలుళ్ల సమయంలో 2008లో బాంబే జనరల్ ఆస్పత్రి ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో వచ్చిన ముంబై డైరీస్ 26/11 చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ముంబైలో సంభవించిన భీకర వరదల నేపథ్యంలో అదే బాంబే జనరల్ హాస్పిటల్‌కు ఎదురైన సవాళ్లు, సిబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులను కథాంశంగా ఈ మెడికల్ థ్రిల్లర్ సిరీస్ సీజన్​ 2 తీశారు.

26/11 పేలుళ్ల సమయంలో టెర్రరిస్ట్​కు ట్రీట్‌మెంట్ అందించి, తన భర్తను కాపాడలేకపోయాడని డాక్టర్ కౌశిక్ ఒబెరాయ్ (మోహిత్ రైనా)పై మిసెస్ కులకర్ణి కేసు వేస్తుంది. ఆ కేసు కోర్టులో నడుస్తుంటుంది. ముంబైలో చోటు చేసుకున్న వరదల కారణంగా జడ్జ్ రాలేకపోవడంతో తీర్పు వాయిదా పడుతుంది. భార్య అనన్య (టీనా దేశాయ్)ను పూణెకు కారులో పంపించి తాను బాంబే జనరల్ హాస్పిటల్‌కు వెళ్తాడు కౌశిక్. ముంబైలో బీభత్సం సృష్టించిన వరదల వల్ల బాంబే జనరల్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వైద్య సిబ్బంది మానసిక పరిస్థితి ఎలా ఉంది?

అలాంటి సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎలాంటి చర్యలకు దారితీశాయి? కౌశిక్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందా? మీడియా ఎలాంటి పాత్ర పోషించింది? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు నింపుకుందే ముంబై డైరీస్ సీజన్ 2. ఎప్పుడు? ఏం జరుగుతుందా? అనే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది ఈ మెడికల్ థ్రిల్లర్ సిరీస్​ ముంబై డైరీస్ సీజన్2.