వెలుగు ఓపెన్ పేజీ : పెరుగుతున్న సోషల్ వర్కర్ల అవసరం

వెలుగు ఓపెన్ పేజీ :  పెరుగుతున్న సోషల్ వర్కర్ల అవసరం

నేటి యాంత్రిక జీవనంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి.  దాంతో సామాజిక సంబంధాలు నిర్వీర్యమై, మనుషుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇవాళ మనిషి బాధను కనీసం వినేవారు కూడా కరువవుతున్నారు. తీవ్రమయిన మానసిక సంఘర్షణలతో మానవుడు సంతోషంగా జీవించడం లేదు. ఇటీవల వెలువడిన ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్​లో భారతదేశం 147 దేశాలకుగాను 116వ స్థానంలో ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

మనుషుల్లో అనైక్యత

నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం మనుషుల్లో అనైక్యత.  మనిషి సంఘజీవి.  సంఘంతో సంబంధం లేకుండా  మానవుడు  ఒంటరిగా  జీవించలేడు  అని మాక్ ఐవర్ అన్నారు. అయితే ఐక్యంగా ఉండడం కంటే ఒంటరిగా ఉండడం వైపే  నేటి మానవుడు  మొగ్గు చూపుతున్నాడు.  కానీ, సమస్యలు ఎదురైనపుడు వాటిని ఒంటరిగా ఎదుర్కోలేకపోవడం,  నైతిక మద్ధతు కరువవుతూ ఉండడం మనుషులను మరింత ఒత్తిడిలోకి నెట్టివేస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్  చెప్పినట్టు  సామాజిక  కట్టుబాట్లు మనిషిలో దాగి ఉన్న జంతు ప్రవృత్తిని అణచివేశాయి.  కానీ,  నేడు మారుతున్న జీవన శైలిలో  సామాజిక  కట్టుబాట్లు నిర్వీర్యం అవుతున్నాయి.  ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కుటుంబ వ్యవస్థ పాత్ర అతి ప్రధానమైనది.  ఉమ్మడి కుటుంబం మనదేశ ప్రత్యేకత. కానీ మారిన సామాజిక పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ క్రమంగా తన పటుత్వాన్ని కోల్పోతూ వచ్చింది.  కుటుంబాల్లో ఉండాల్సిన పరస్పర అవగాహన, సహకారం వంటివి నేటి సమాజంలో కనిపించడం లేదు.   

నైతిక విలువలు పెంపొందించాలి

నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం బలహీనపడి  విడాకుల రేటు  క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మరొకవైపు వయోవృద్ధుల సంక్షేమం ఇవాళ ప్రధాన సమస్యగా  మారింది.  వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కుటుంబాలు వారి బాధ్యతను  విస్మరిస్తున్నాయి.  వృద్ధులకు  సొంతవారి నుంచే అసహ్యం, ఈసడింపులు పెరిగిపోతున్నాయి.   వృద్ధుల సంరక్షణ  ఒక భారంగా భావిస్తున్న పిల్లలే ఎక్కువ సమాజంలో.  దీంతో వయస్సు పైబడిన తర్వాత వృద్ధులు నాణ్యమైన జీవనాన్ని పొందలేకపోతున్నారు. యాంత్రికంగా వారి భౌతిక అవసరాలు మాత్రమే  తీరుస్తున్నారు తప్పితే వారి మానసిక స్థితిని  పట్టించుకోవడం లేదు.  దీనంగా ఉంటున్న వృద్ధులను కదిలిస్తే వారి మనో సంఘర్షణ  వర్ణనాతీతం. ఆత్మగౌరవం కోసం అచేతన స్థితిలో కూడా పని చేస్తున్నారు.  కొందరు అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వృద్ధాప్యంలో తమ బిడ్డలు ఎక్కడ తమను భారంగా చూస్తారనే భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  నేడు సామాజిక, నైతిక  విలువలు పెంపొందించవలసిన  అవసరం ఉంది.  

యువతలో హింసాత్మక ధోరణి

యువతలో హింసాత్మక ధోరణులు, నేర పూరిత స్వభావం క్రమంగా పెరిగిపోతున్నది. మానవుడి ఎదుగుదలలో గురువు పాత్ర అతి ప్రధానమైనది. అందుకే తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు. కానీ టీచర్, - స్టూడెంట్ మధ్య ఉండాల్సిన మానవీయ సంబంధాలు క్రమంగా పలుచబడి పోతున్నాయి. ఇటీవల ఏకంగా టీచర్​ను ఒక విద్యార్థి పరుష పదజాలంతో దూషించడం,  అందరిముందే భౌతిక దాడికి పాల్పడిన ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరచింది. పిల్లల్లో ఇటువంటి తెగింపు,  విపరీత ధోరణులు ఈమధ్య కాలంలో హెచ్చుమీరుతున్నాయి. ఇది కేవలం వెలుగు చూసిన  ఒక్క ఘటన మాత్రమే. బహిర్గతంకానిఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. యువత విలాసవంతమైన జీవన విధానానికి అలవాటు పడి ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. విద్యార్థుల మధ్య పరస్పర భౌతిక దాడులు పెరిగాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ యువత తమ ప్రాణాలను కోల్పోవడంతోపాటుగా, ఇతరుల కుటుంబాలు సైతం బాధితులుగా మిగులుస్తున్నారు. లింగభేధం లేకుండా ఇటువంటి ధోరణులు అవలంబిస్తుండడం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. చిన్న వయస్సులోనే పెరుగుతున్న  మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం,  పిల్లల ప్రవర్తన పట్ల నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి.

ప్రధానమైన మానవ వనరులు సోషల్ వర్కర్లు

విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణతోపాటుగా, విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించేందుకు సామాజిక కార్యకర్తలను నియమించాలన్న ప్రతిపాదన నేటికీ ఆచరణకు నోచుకోలేదు.  ఇటువంటి సవాళ్ల నేపథ్యంలో ఆరోగ్యవంతమైన సమాజ మనుగడకు ఒక బలమైన సైద్ధాంతిక భావజాలం, నైతికమద్దతు అందించే వ్యవస్థ, మానవ వనరుల అవసరం స్పష్టంగా కనిపిస్తుంది.  సామాజిక సమస్యలకు శాస్త్రీయ కోణంలో సోషల్ వర్కర్లు పరిష్కారం చూపగలుగుతారు.  ఆధునిక జీవన విధానంలో మనుగడ కోల్పోతున్న సామాజిక వ్యవస్థల పునరుద్ధరణతోపాటుగా,  మానసిక సంఘర్షణలు రూపు మాపడంలో సంఘ సంక్షేమ విధానాలు, దృక్పథాలు కీలకంగా పని చేస్తాయి. అందుకే  క్షేత్రస్థాయి నుంచి  మొదలు,  ఉన్నతస్థాయి నిర్ణయాల దాకా సమాజాన్ని అన్ని కోణాల్లో విశ్లేషించి, పరిష్కారం చూపగలిగే  సోషల్ వర్కర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం నేడు కనిపిస్తున్నది.  ఇంతటి ప్రాధాన్యం ఉన్న సోషల్ వర్కర్లు  నేటికీ సమాజంలో పెద్దగా 
గుర్తింపుకు  నోచుకోవడం లేదు.  ప్రభుత్వాలు సోషల్ వర్కర్ల పట్ల వివక్షనే చూపుతున్నాయి. అన్ని వ్యవస్థల్లో సోషల్ వర్కర్ల అవసరం ఉన్నా దానిని పట్టించుకునేవారే లేరు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు పొందాలి అంటే ఇటువంటి సమస్యల పట్ల ఒక నిర్దిష్టమైన కార్యాచరణ అవసరం. అందులో సోషల్ వర్కర్లు ప్రధానమైన మానవ వనరులుగా ఉపయోగపడతారు.  ప్రభుత్వాలు దానిని గుర్తించి సోషల్ వర్కర్లకు తగిన ప్రాధాన్యతనిచ్చి మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి. 

మానవ సమాజం అనేక సామాజిక వ్యవస్థలతో ఏర్పాటైన సంక్లిష్ట నిర్మాణం.  సమాజ మనుగడలో ప్రతి సామాజిక వ్యవస్థ దాని బాధ్యతలను, హక్కులను కలిగి ఉంటుంది. అయితే నేడు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సామాజిక వ్యవస్థలు  తీవ్రమైన ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. పరిణామ క్రమంలో  సామాజిక మార్పులు అనేవి అత్యంత సహజం,  అనివార్యం కూడా.   కానీ, ఆ సామాజిక మార్పులు సమాజాన్ని  వృద్ధిలోకి తెచ్చేదిగా ఉంటేనే  మానవుని  గుణాత్మక అభివృద్ధి  సాధ్యపడుతుంది.  కానీ,  నేడు చూస్తుంటే సమాజం అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నది.  ఒకవైపు క్షేత్ర స్థాయి నుంచి మొదలు ప్రపంచ స్థాయి దాకా ఘర్షణలు,  మరొకవైపు వాటి పర్యవసానంగా మానసిక సంఘర్షణలు వెరసి సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

- డా.అనిల్ మేర్జ