అసంతృప్తులకు కాంగ్రెస్ హైకమాండ్​ బుజ్జగింపులు

అసంతృప్తులకు కాంగ్రెస్ హైకమాండ్​ బుజ్జగింపులు
  • అసంతృప్తులకు  హైకమాండ్​ బుజ్జగింపులు
  • 15 మంది కాంగ్రెస్ నేతలతో ఫోన్‌‌లో మాట్లాడిన కేసీ వేణుగోపాల్

హైదరాబాద్, వెలుగు : అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడినట్లు సమాచారం. అసంతృప్తులకు ఆయన వ్యక్తిగతంగా ఫోన్ చేసి బుజ్జగించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కొందరికి ఎంపీ టికెట్లు, మరికొందరికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు నేతలు చెప్తున్నారు. డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు స్థానాల్లో టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆయనకు టికెట్​ దక్కకపో వడంతో కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లాడారు. ఎంపీ సీటిస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. బలరాం నాయక్‌‌కూ ఫోన్ చేసి.. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని,  వనపర్తి టికెట్ ఆశించి భంగపడిన చిన్నా రెడ్డిని కూడా బుజ్జగించినట్టు తెలుస్తున్నది. 

పటాన్​చెరు టికెట్ విషయంలో సీనియర్ లీడర్లు దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి పట్టువీడకపోవడంతో.. వారిద్దరికీ ఫోన్ చేసి సంధి కుదిర్చినట్టు తెలుస్తున్నది. చివరకు శ్రీనివాస్ గౌడ్‌‌కే టికెట్ అనౌన్స్ చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి, ఎన్ఎస్‌‌యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌‌లకు కేసీ వేణుగోపాల్ ఫోన్​ చేసి మాట్లాడారని సమాచారం. ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్‌‌లకు ఫోన్ చేశారు.