
- వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు కోసం 2013లో బిల్లును ఆమో దించినా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల పల్లి మండలం కొత్తతండా గ్రామస్తుడు భూక్యా దేవ నాయక్ హైకోర్టులో పిల్దాఖలు చేశారు.
ఈ పిల్‌ను శుక్రవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. లాయర్ భూక్యా మంగ్లిలాల్ వాదిస్తూ.. కేంద్రంలో ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు ఉంటే.. రాష్ట్రంలో మాత్రం రెండింటికీ ఒకే కమిషన్ ఉందన్నారు. వేర్వేరుగా ఉండాలని గిరి జన సలహా మండలి చెప్పినా పట్టించు కోలేదని వివరించారు. వాదనల తర్వాత డివిజన్ బెంచ్ తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.