ఇదేం నివేదిక.. 49 మంది చనిపోతే పరిహారం ఎంతిచ్చారు?

ఇదేం నివేదిక..  49 మంది చనిపోతే పరిహారం ఎంతిచ్చారు?
  • 49 మంది చనిపోతే పరిహారం ఎంతిచ్చారు?
  • 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో వివరించలేదు
  • అంటు వ్యాధుల నివారణకు తీసుకున్నచర్యలేవీ..?
  • రెండో నివేదిక కూడా అసంపూర్తేనా..?
  • సర్కారు తీరును తప్పు పట్టిన హైకోర్టు

హైదరాబాద్ : వరదలపై ప్రభుత్వం రెండు సార్లు సమర్పించిన నివేదికలు అసంపూర్తిగా ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఇవాళ ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం పలు అంశాలను ప్రస్తావించింది. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సహాయం చేశారో వివరాలు సరిగా లేవని తెలిపింది. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాది ఇవాళ సమర్పించారు.

రూ.500 కోట్లు రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే.. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు అంటువ్యాధులతో భాదపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.