భార్యకు భరణం ఇవ్వకపోతే భర్త ఆస్తి వేలం!

భార్యకు భరణం ఇవ్వకపోతే భర్త ఆస్తి వేలం!
  • అప్పీల్స్ తో ఏండ్లుగా సాగదీస్తున్న భర్తపై హైకోర్టు ఆగ్రహం 
  • 5 లక్షలు డిపాజిట్ చేయకుంటే ఆస్తి వేలం వేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు:  విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించకుండా అప్పీల్స్ దాఖలు చేస్తూ కాలయాపన చేస్తున్న భర్తపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదహారేళ్లుగా పైసా భరణం చెల్లించకుండా భార్య, ఇద్దరు పిల్లలను ఇబ్బంది పెట్టడం ఏమిటని మండిపడింది. ‘‘ఫ్యామిలీ కోర్టులో శాశ్వత భరణం కింద రూ.40 లక్షలు, 2.22 ఎకరాలు ఇస్తానని ఒప్పుకున్నారు. ఇప్పుడేమో హైకోర్టులో అప్పీల్‌‌ చేసి రూ.10 లక్షలే ఇస్తానంటున్నారు. ఇందులో సగం ఇప్పుడు డిపాజిట్ చేయాలని చెప్తే సుప్రీంకోర్టులో అప్పీల్ చేశామంటారు? ఇదేం పద్ధతి?” అంటూ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఫైర్ అయ్యింది. దీనిపై మార్చి 5న తదుపరి విచారణ చేపడతామని, ఆలోగా 10 లక్షల్లో సగం 5 లక్షలను డిపాజిట్ చేయకపోతే అతని ఆస్తులు వేలం వేసి, వచ్చే డబ్బును భార్య బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని మహబూబ్‌‌నగర్‌‌ అర్బన్‌‌ తహసీల్దార్‌‌ను ఆదేశించింది.

పదహారేండ్లుగా… 

సూర్యాపేటకు చెందిన లక్ష్మీతులసి, పాలమూరు జిల్లా పాలకొండకు చెందిన ఎ.సురేందర్‌‌కు పెద్దలు పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టాక గొడవలు రావడంతో, వారు ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నారు. లక్ష్మీతులసి, పిల్లలకు శాశ్వత భరణం కింద 2.22 ఎకరాల భూమి, రూ.40 లక్షల క్యాష్‌‌ ఇచ్చేందుకు 2004లో ఫ్యామిలీ కోర్టులో సురేందర్ ఒప్పుకున్నాడు. దానిపై హైకోర్టులో అప్పీల్ చేసి 10 లక్షలు మాత్రమే చెల్లిస్తానని కోరాడు.