హైదరాబాద్, వెలుగు: కారును పోలిన 8 గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించకుండా ఎలక్షన్ కమిషన్(ఈసీ)కు ఉత్తర్వులు ఇవ్వాలని టీఆర్‌ఎస్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. కారును పోలిన గుర్తులపై గతంలో టీఆర్‌ఎస్ చేసిన అభ్యంతరాలపై ఈసీ స్పందించిందని, అప్పుడు ఈ సింబల్స్‌పై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించింది. ప్రాసెస్ మొదలైన తర్వాత దాఖలైన కేసులను విచారించి ఈసీకి ఉత్తర్వులిస్తే అది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కూడా ఉన్నాయని చెప్పింది. కారును పోలిన కెమెరా, చపాతి రోలర్, డోలీ, రోడ్ రోలర్, సోప్ బాక్స్, టీవీ, కుట్టుమిషన్, షిప్ గుర్తులను మునుగోడు ఉప ఎన్నికలో ఇండిపెండెంట్లకు కేటాయించకుండా ఉత్తర్వులివ్వాలని కోరుతూ టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ సోము భరత్ కుమార్ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీజే జస్టిస్ఉజ్జన్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. ఎన్నికల ప్రక్రియపై రిట్ వేయలేదని, ఎన్నికలు ఫెయిర్‌గా జరగాలని, గుర్తులు గందరగోళంగా ఉండకూడదనే పిటిషన్ వేశామని పిటిషనర్ తరఫు అడ్వొకేట్ శ్రీరఘురాం వివరించారు. ఈవీఎంలో సింబల్స్ చిన్న సైజులో ఉంటాయని, ఆ 8 గుర్తులు కారును పోలినట్లుగా కనిపిస్తే దాని ప్రభావం ఎన్నికపై పడుతుందన్నారు. ఈసీకి వినతిపత్రం ఇస్తే స్పందించకపోవడం వల్లే రిట్ దాఖలు చేశామన్నారు.
టీఆర్ఎస్ వినతిపత్రాన్ని తిరస్కరించాం: ఈసీ
ఈసీ తరఫున అడ్వకేట్ అవినాశ్ దేశాయ్ వాదిస్తూ రిట్‌కు చెల్లుబాటు లేదని, ఎన్నికల ప్రక్రియ మొదయ్యాక దాఖలయ్యే కేసుల్లో కోర్టులు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం లేదన్నారు. టీఆర్‌ఎస్ గతంలో రిక్వెస్ట్ చేశాక 3 గుర్తులను తొలగించామని, అప్పుడు ఈ 8 సింబల్స్ ప్రస్తావించలేదన్నారు. రోడ్ రోలర్ ఎవరికీ కేటాయించలేదని, చపాతీ రోలర్, టీవీ, కెమెరా వంటివి కేటాయించామన్నారు. బై ఎలక్షన్స్ ప్రాసెస్ మొదలయ్యాక సింబల్స్ కేటాయింపుపై వినతిపత్రం ఇస్తే చర్యలు తీసుకునేందుకు వీలుండదని చెప్పారు.
రోడ్ రోలర్ గుర్తుపై టీఆర్ఎస్ అభ్యంతరం
న్యూఢిల్లీ, వెలుగు: మునుగోడు బైపోల్లో ఓ స్వతంత్ర అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంపై టీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. రోడ్డు రోలర్ గుర్తు.. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తయిన కారును పోలి ఉందని, ఆ గుర్తును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్, ఏడీజీ రాంచందర్ రావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్-లో ఈసీఐ సభ్యులు అనూప్ చంద్ర పాండేను కలిసి పార్టీ తరఫున రిప్రజెంటేషన్ కాపీని అందజేశారు.
