- కోర్టు ఉత్తర్వులు ఇచ్చేదాకా కూడా ఆగలేరా
- సంధ్య కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: కూల్చివేతల సమయంలో చట్టప్రకారం వెళ్లాలని ఇటీవల కోర్టుకు పిలిచి మరీ చెప్పినా పట్టించుకోకుండా పాత పంథానే అనుసరిస్తున్న హైడ్రా తీరుపై మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా కూడా ఆగలేకపోయారా అంటూ నిలదీసింది.
తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టాల్సినంత అత్యవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నం.124, 125లో సంధ్యా కన్వెన్షన్ నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు ఎం.ఎస్.ప్రసాద్, బి.మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సంధ్య కన్వెన్షన్ జీహెచ్‌ఎంసీ అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టిందన్నారు. అంతేగాకుండా హైడ్రా కూడా ఎన్వోసీ జారీ చేసిందన్నారు. అయినా సోమవారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకే కూల్చివేతలు చేట్టిందన్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ వాటిని పట్టించుకోలేదన్నారు. కూల్చివేతలకు ముందు పిటిషనర్లకు నోటీసులు జారీ చేయకుండా, తమ వాదన వినకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు చెబుతున్నారన్నారు. దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము అధికారికంగా ఇలాంటి ప్రకటన విడుదల చేయలేదన్నారు.
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అసలు హైడ్రాకు సొసైటీలో జోక్యం చేసుకునే పరిధి ఏముందని ప్రశ్నించారు. ఒకవేళ రోడ్లను ఆక్రమించారని ఫిర్యాదులు అందితే దీనిపై ఎవరు సర్వే నిర్వహించి ఆక్రమణలను తేల్చారని ప్రశ్నించారు.
ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ సొసైటీ ఎఫ్‌టీఎల్ కాదని, అంతేగాకుండా ప్రభుత్వ భూమి కాదని, అలాంటప్పుడు సొసైటీలో ఎవరి సూచనలతో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందన్నారు. సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై వివరాలు సమర్పించాలని హైడ్రాతోపాటు జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.
