ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలేవి? పట్టించుకోరా?

ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలేవి? పట్టించుకోరా?

హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్​మెంట్​కు కార్పొరేట్‌‌ ఆస్పత్రులు ఎంత చార్జీలు వసూలు చేయాలో జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ఆర్డర్లను ప్రైవేట్‌‌ ఆస్పత్రులు అమలు చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ జీవోను ఖాతరు చేయకుండా చార్జీలను వసూలు చేసే ప్రైవేట్‌‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ‘‘కార్పొరేట్‌‌ ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, దారుణంగా బిల్లులు వేస్తున్నాయని పేపర్లలో వార్తలు వస్తున్నాయి. అలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో చెప్పాలి. చర్యలు తీసుకోకపోతే కారణాలూ చెప్పాలి” అని ఆదేశించింది. దానిపై రిపోర్టును ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు

మెడికల్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ ఇండియా ప్రమాణాలను పాటించడం లేదని హైదరాబాద్​కు చెందిన లాయర్‌‌ శ్రీకిషన్‌‌ శర్మ వేసిన పిల్‌‌ను మంగళవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ జరిపింది. ‘‘పేపర్లు, టీవీల్లో వస్తున్న వార్తలు చూస్తుంటే చాలా ప్రైవేట్‌‌ ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లుగా ఫీజుల్ని వసూలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. గవర్నమెంట్‌‌ ఆస్పత్రిలో డీఎంవోగా చేసే సుల్తానాకు కరోనా వస్తే తుంబే ప్రైవేట్‌‌ కార్పొరేట్‌‌ ఆస్పత్రి చేసిన నిర్వాకం కూడా తెలిసింది” అని చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సోమాజిగూడ యశోద సూపర్‌‌ స్పెషాలిటీ ఆస్పత్రి, బంజారాహిల్స్‌‌ కేర్, సికింద్రాబాద్‌‌ సన్‌‌సైన్‌‌ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది.