ప్రజల వ్యక్తిగత సమాచారం మీకెందుకు? : హైకోర్టు

ప్రజల వ్యక్తిగత సమాచారం మీకెందుకు? : హైకోర్టు
  •     10 రోజుల్లోగా వివరణ ఇవ్వండి
  •     పోలీసులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు అడుగుతున్నారో  చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు కొన్ని ప్రశ్నలతో ఉన్న  ఓ నమూనా పత్రాన్ని పూర్తిచేయించి అందులో వ్యక్తిగత సమాచారాన్ని అడగడం రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలంటూ హైదరాబాద్‌లోని చైతన్య మహిళా సంఘం కార్యదర్శులు దేవేంద్ర, స్వప్న, అన్నపూర్ణ వ్యాజ్యం వేశారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌టి.వినోద్‌కుమార్‌మంగళవారం విచారణ చేపట్టారు. ఆ విధమైన సమాచారాన్ని ఎందుకు అడుగుతున్నారు? కారణాలేమిటీ? అని పోలీసు శాఖను జడ్జి ప్రశ్నించారు. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రాచకొండ, హైదరాబాద్‌సీపీలు, మేడిపల్లి, కుషాయిగూడ, ఉప్పల్‌స్టేషన్ల హౌస్‌ఆఫీసర్లు, ఇంటెలిజెన్స్ ఐజీకి నోటీసులిచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను డిసెంబర్‌10కి వాయిదా వేశారు. చైతన్య మహిళా సంఘం 1995లో ఏర్పడిందని, మహిళలపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బాధితుల అభ్యున్నతికి ఆ సంఘం కృషిచేస్తోందని పిటిషనర్ల తరపున లాయర్ రఘునాథ్ చెప్పారు. ఈ నెల 22న ఇద్దరు కానిస్టేబుళ్లు దేవేంద్ర ఇంటికి వెళ్లి స్టేషన్‌కు రావాలన్నారని, ఎందుకు రావాలని ప్రశ్నిస్తే వెళ్లిపోయారని తెలిపారు. మర్నాడు ఇద్దరు కానిస్టేబుళ్లు దేవేంద్ర లేనప్పుడు వచ్చి ఆమె తండ్రిని స్టేషన్‌కు తీసుకెళ్లారని, విషయం తెలిసి ఆమె పోలీసు స్టేషన్‌కు వెళితే 33 ప్రశ్నలతో కూడిన పత్రాన్ని ఇచ్చి దాన్ని పూరించాలని ఒత్తిడి చేశారని చెప్పారు.