గడ్డి అన్నారం మార్కెట్‌ ఖాళీ చేయండి

గడ్డి అన్నారం మార్కెట్‌ ఖాళీ చేయండి

హైదరాబాద్, వెలుగు: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్‌ను ఈ నెల 18వ తేదీ నాటికి వ్యాపారులంతా ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాటసింగారం మార్కెట్‌కు తరలివెళ్లాలని చెప్పింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ సతీశ్​చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి బెంచ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గడ్డి అన్నారంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి వ్యాపారులు హైకోర్టులో సవాల్‌ చేశారు. కోర్టు ఆదేశాలను అధికారులు పాటించట్లేదంటూ కోర్టు ధిక్కరణ కేసులు కూడా వేశారు. ఈ పరిస్థితుల్లో అప్పటికప్పుడు అధికారులు గడ్డి అన్నారం మార్కెట్‌ తెరిచారు. అయితే, చాలామంది వ్యాపారులు బాటసింగారం మార్కెట్‌కు వెళ్లిపోయారని తాజాగా జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కట్టాలన్న ప్రభుత్వ ఆలోచన అమలయ్యేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పబ్లిక్‌ హెల్త్‌ కోసం ఆస్పత్రి నిర్మించాలన్న సర్కారు నిర్ణయానికి అడ్డంకులు సృష్టించడం సరికాదని అభిప్రాయపడింది. తదుపరి విచారణలో గడ్డిఅన్నారం మార్కెట్‌ నుంచి వ్యాపారులు వెళ్లిపోవడంపై సమగ్ర వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.