షర్మిల పాదయాత్రపై పోలీసుల తీరు పట్ల హైకోర్టు ఫైర్

 షర్మిల పాదయాత్రపై పోలీసుల తీరు పట్ల హైకోర్టు ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాజకీయ పార్టీల నాయకులు జనంలోకి వెళ్లేందుకు పాదయాత్రలు రాజ్యాంగబద్ధమైన విధానమని, కానీ రాష్ట్రంలో పాదయాత్రలు చేయాలంటే నేతలు న్యాయస్థానానికి రావాల్సి వస్తోందంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశించినా వైఎస్సార్‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. తెలంగాణను అఫ్గానిస్తాన్‌‌తోను, టీఆర్‌‌ఎస్‌‌ వాళ్లను తాలిబాన్లతోనూ పోల్చుతూ షర్మిల మాట్లాడారని, గవర్నర్‌‌ను కలిసి బయటకు వచ్చాక అలాంటి కామెంట్లు చేసినందుకే పాదయాత్రకు అనుమతివ్వలేదని ప్రభుత్వం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పాదయాత్రలో ఆ వ్యాఖ్యలు చేయలేదని, బయట చేసిన వ్యాఖ్యలకు పాదయాత్రకు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించింది. పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ టీపీ లీగల్ సెల్ నేత రవీంద్రనాథ్ రెడ్డి దాఖలు చేసిన రిట్ ను జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి మంగళవారం విచారించారు. గతంలో విధించిన షరతులకు అనుగుణంగా పాదయాత్రకు పర్మిషన్‌‌ ఇవ్వాలని వరంగల్‌‌ పోలీస్‌‌ కమిషనర్‌‌ను ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. షర్మిల తరఫున అడ్వకేట్ వరప్రసాద్ వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఎం. రూపేందర్ వాదిస్తూ.. పాదయాత్రలో షర్మిల అనుచితంగా మాట్లాడుతున్నారని, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిట్టారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఎమ్మెల్యేకు అవమానం జరిగితే ఆయన కోర్టుకు రావాలి గానీ ప్రభుత్వం వకాల్తా పుచ్చుకోరాదని స్పష్టం చేసింది.  

కోర్టుకు కూడా పోనియ్యరా?: షర్మిల 

సీఎం కేసీఆర్ పోలీసులను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. పాదయాత్రకు పర్మిషన్ కోరుతూ వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణకు వెళ్తుండగా లోటస్ పాండ్ లోని ఇంటి నుంచి ఆమెను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, సిటిజన్ గా హైకోర్టుకు వెళ్లే హక్కు కూడా లేదా? నేను హౌస్​ అరెస్టులో కూడా లేను. ఒకవేళ హౌస్​ అరెస్ట్ ఆర్డర్స్ ఉంటే చూపించాలని అడిగితే పోలీసుల నుంచి ఆన్సర్ లేదు. కోర్టుకు కూడా పోనియ్యకుండా అడ్డుకోవడం ఏందీ? ఇది ప్రజాస్వామ్యమేనా?” అని ఆమె మండిపడ్డారు. ఆమరణ దీక్ష చేస్తే లోటస్ పాండ్ చుట్టుపక్కల కర్ఫ్యూ విధించారని, ఎక్కడ చూసినా బారికేడ్స్ పెట్టి, వందల మంది పోలీసులను మోహరించారని అన్నారు. కార్యకర్తలను సైతం రానివ్వలేదని, వచ్చిన వాళ్లను నానా రకాలుగా హింస పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హైకోర్టు తీర్పు ప్రకారం పోలీసులు యాత్రకు సహకరించకపోతే మరోసారి కోర్టుకు వెళతామని షర్మిల తరఫున వాదించిన అడ్వకేట్ వరప్రసాద్ తెలిపారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో షర్మిల మళ్లీ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. యాత్ర ఎప్పటి నుంచి? ఎక్కడి నుంచి? అనే వివరాలను బుధవారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.