
- ఫిర్యాదుదారు చనిపోతే మేం ఎవరిని విచారించాలి: హైకోర్టు
- గడువిస్తే వాదనలు వినిపిస్తాం: పీపీ
- తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా
- మేడిగడ్డ విషయంలో కేసీఆర్‌పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావును విచారించాలని ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి చనిపోయినందున ఆ ఫిర్యాదుకు విచారణార్హత లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఫిర్యాదుదారుడు మరణించినప్పుడు కేసులో కోర్టు ఎవరిని విచారించాలో, ఎవరి స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ చేయాలో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపితే ఫిర్యాదులోని అంశాలపై ఎవరు వాంగ్మూలం ఇస్తారని అడిగింది. అయితే, ఫిర్యాదుదారు చనిపోయినా విచారణ జరపవచ్చని, గడువు ఇస్తే వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.
మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. దీనిపై రివిజన్ ఫిర్యాదును విచారణ చేయాలని జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయాన్ని కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ హైకోర్టులో సవాల్ చేసిన పిటిషన్‌ను జస్టిస్ కె. లక్ష్మణ్ శుక్రవారం మరోసారి విచారించారు.
మేడిగడ్డ కుంగుబాటే నిలువెత్తు సాక్ష్యం
విచారణ సందర్భంగా జస్టిస్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ..ఫిర్యాదుదారు నాగవల్లి రాజలింగమూర్తి మృతి చెందినట్లుగా పత్రికలో చదివినట్లు చెప్పారు. ఫిర్యాదుదారుడు చనిపోయిన తర్వాత ఆయన తరఫున ఎలా వాదిస్తారని ప్రభుత్వ అడ్వకేట్ ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ అవసరం లేదని అభిప్రాయ పడ్డారు. దీనికి పీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదుపై విచారణ కొనసాగించవచ్చని కోర్టుకు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు దుర్వినియోగం చేసిందని చెప్పడానికి మేడిగడ్డ కుంగుబాటే నిలువెత్తు సాక్ష్యమని వెల్లడించారు. దీనిపై స్పందించిన కోర్టు.. తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని, పిర్యాదు ఎలా విచారణార్హమో చెప్పాలని ప్రశ్నించింది. మేజిస్ట్రేట్ కోర్టులో రాజలింగమూర్తి ఫిర్యాదు చేస్తే పరిధి లేదంటూ కొట్టేసిందని, దానిపై రివిజన్ దాఖలు చేయగా జిల్లా జడ్జి విచారణకు అనుమతించిందని, జిల్లా జడ్జి నిర్ణయాన్ని తాము సమర్థిస్తే.. ఫిర్యాదుదారుడే బతికిలేనప్పుడు కింది కోర్టు ఎవరిని విచారిస్తుందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి నివేదిక సమర్పించలేనప్పుడు విచారణ కొనసాగింపు ఎలా చేపట్టాలో చెప్పాలంది. పిర్యాదులోని అంశాలపై వాంగ్మూలం ఫిర్యాదుదారుడే ఇవ్వాలని, ఇక్కడ ఫిర్యాదుదారుడు చనిపోయారని, ఇక వాంగ్మూలం లేకుండా కేసు విచారణ ఎలా జరుగుతుందని సందేహాన్ని వ్యక్తం చేసింది.
ఈ కేసుకు సీఆర్‌పీసీ సెక్షన్ 256 వర్తించదు
కోర్టు అడిగిన ప్రశ్నలకు పీపీ బదులిస్తూ..సీఆర్‌పీసీసెక్షన్ 256 ప్రకారం ఫిర్యాదుదారు లేకపోయినా విచారణ జరపవచ్చని కోర్టుకు తెలిపారు. అయితే, దీనిపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ సెక్షన్ ఫిర్యాదుదారు కేసు విచారణప్పుడు హాజరు మినహాయింపునకు సంబంధించినదని గుర్తుచేసింది. ఆ సెక్షన్ తమ ముందున్న సెక్షన్‌కు వర్తించదని చెప్పింది. తిరిగి పీపీ కల్పించుకుని ప్రజాప్రయోజన కోణంలో కూడా ఈ వ్యవహారాన్ని చూడాలని కోరగా, అదే అనుకుంటే నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజలింగమూర్తి ఒక్కరే లేరని, ఎవరో ఒకరు ఫిర్యాదు చేయవచ్చునని, లేదా హైకోర్టులో పిల్ దాఖలు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. పీపీ వినతి మేరకు విచారణను ఈనెల 24కు వాయిదా పడింది.