హెయిర్ రీగ్రోత్ సీరం ప్రయోగం సక్సెస్.. ఇక బట్టతలపై 20 రోజుల్లోనే.. వెంట్రుకలు మొలుస్తాయ్ !

హెయిర్ రీగ్రోత్ సీరం ప్రయోగం సక్సెస్.. ఇక బట్టతలపై 20 రోజుల్లోనే.. వెంట్రుకలు మొలుస్తాయ్ !

దుమ్ముధూళితో పాటు, ప్రొటీన్స్ లోపం వల్ల బట్ట తల సమస్య బాధిస్తుంది. ఒకప్పుడు 40, 50 ఏళ్ల వయసులో బట్టతల సమస్య ఉంటే ఇప్పుడు 20 నుంచి 30 ఏళ్ల వయసులో ఉన్న కొందరు యువకులు కూడా ఈ బట్టతల బాధితులుగా మారుతున్నారు. మారిన జీవన విధాన శైలినే ఇందుకు ప్రధాన కారణం. 

ముఖ్యంగా పెళ్లి కావాల్సిన యువకులకి బట్టతల ఉంటే పెళ్లి కాదని భయం. ఇలా ఒకటేమిటి కాలేజీ, ఆఫీస్, ఇంటా, బయట తలెత్తే ఇబ్బందులు మాటల్లో చెప్పలేం. అయితే.. ఈ బట్టతల సమస్యకు చెక్ పెట్టే దిశగా శాస్త్రవేత్తల ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చాయి. వెంట్రుకలు లేని ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. కేవలం 20 రోజుల్లోనే వెంట్రుకలను మొలిపించే సీరంను పరిశోధకులు సృష్టించారు. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఇది త్వరలో బట్టతలతో బాధపడుతున్న బాధితులకు కూడా అందుబాటులోకి రావచ్చు. ఎలుకల చర్మంలోని కొవ్వు కణాలను ప్రేరేపించి, ఇవి వెంట్రుకలను పునరుత్పత్తి చేసే విధంగా ఈ సీరం పనిచేసిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

నేషనల్ తైవాన్ యూనివర్సిటీ నిపుణులు తమ ప్రత్యేకమైన సీరంలో సహజంగా లభించే కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని, ఇవి చర్మానికి ఏమాత్రం చికాకు కలిగించవని తెలిపారు. స్కిన్ కేర్ ప్రొడక్ట్‌ రూపంలో త్వరలో ఈ సీరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రొఫెసర్ సంగ్-జాన్ లిన్ తన కాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి యొక్క ప్రారంభ వెర్షన్‌ను ఉపయోగించానని మరియు తన ఉత్పత్తి అద్భుతాలు చేసిందని పేర్కొన్నాడు. ఈ ప్రయోగంలో భాగంగా ఒక శాస్త్రవేత్త ఈ సీరంను తన తొడలకు అప్లై చేశాడు. కేవలం 10 నుంచి 11 రోజుల్లో ఆ భాగంలో కొత్తగా వెంట్రుకలు రావడం మొదలైంది.

ఇదిలా ఉండగా.. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడానికి ఈ తరహా ప్రయోగాలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. మనుషుల మూలకణాలను వాడి, బోడి చిట్టెలుకకు సైంటిస్టులు కొత్త వెంట్రుకలు మొలిపించారు. తొలుత చిట్టెలుక, మనుషుల్లోని డెర్మల్ పాపిలా అనే కణాలను కలిపారు. అనంతరం దాన్ని చిట్టెలుక చర్మం లోపల ప్రవేశపెట్టారు. కొద్దిరోజులకు సహజంగా వెంట్రుకలు మొలిచాయి. వయసు పెరిగో, జీన్ సమస్యల వల్లో, జబ్బుల కారణంగానో చాలా మందిని బట్ట తల సమస్య వేధిస్తోంది.

గతంలో ఇలాంటి టెక్నిక్‌‌ను కొందరు పరిశోధకులు ఆవిష్కరించినా, జుట్టు పెరుగుదలను కంట్రోల్ చేయలేం. ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టిన టెక్నిక్‌‌తో అదుపు చేయొచ్చట. అంతేకాకుండా చాలా సహజంగా కనిపిస్తుంది. 2019లోనే అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ (ఐఎస్ఎస్సీఆర్) సదస్సులో శాన్ ఫర్డ్ బర్న్ హమ్ ప్రీబీస్ మెడికల్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు బట్ట తలను నిరోధించే కొత్త స్టెమ్ సెల్ పద్ధతి గురించి వివరించారు.