ప్రపంచంలోనే అణుశక్తితో పనిచేసే తొలి మిస్సైల్ ప్రయోగం సక్సెస్.. ఇక తిరుగు లేదంటున్న రష్యా అధ్యక్షుడు

ప్రపంచంలోనే అణుశక్తితో పనిచేసే తొలి మిస్సైల్ ప్రయోగం సక్సెస్.. ఇక తిరుగు లేదంటున్న రష్యా అధ్యక్షుడు


అక్టోబర్ 21న ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ పుతిన్‌కు తెలియజేశారు. ఈ పరీక్ష సమయంలో, బురెవ్‌స్ట్నిక్ దాదాపు 15 గంటల పాటు ప్రయాణించి, 14 వేల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ఈ రేంజ్ ఫైనల్ కాదని.. ఇంతకు మించిన దూరం కవర్ చేస్తుందని తెలిపారు. న్యూక్లియర్ ఎనర్జీతో నడిచేది కాబట్టి దీనికి రేంజ్ అంటూ ఉండదని పేర్కొన్నారు. 

ఈ మిస్సైల్ పై వెలువడిన రిపోర్ట్స్ ప్రకారం.. దీని వేగం గంటకు దాదాపు 1300 కి.మీ ఉంటుందని తెలుస్తోంది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలాంటి క్షిపణి లేదని ఈ సందర్భంగా పుతిన్ అన్నారు. ఇలాంటి మిస్సైల్ తయారు చేయడం అసాధ్యమని అందరూ అనుకున్నారని.. కానీ.. తాము చేసి చూపించామని అన్నారు. 

వాయు రక్షణ వ్యవస్థలు గుర్తించలేవు.. 

బ్యూరెవెస్ట్నిక్ (9M730) అనేది సాంప్రదాయ ఇంధనానికి బదులుగా అణు రియాక్టర్‌తో నడిచే క్రూయిజ్ క్షిపణి. ఇది ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. అదే విధంగా శత్రు దేశాల యాంటీ మిస్సైల్ సిస్టమ్ ( క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలను) తప్పించుకునే టెక్నాలజీతో రూపొందించారు. 

ఈ మిస్సైల్ తో రష్యా 10 వేల నుంచి 20 వేల కి.మీ.ల ఖండాంతర పరిధితో దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అమెరికా డిఫెన్స్ నివేదికలో వెల్లడించింది. ఈ మిస్సైల్ తో అమెరికాలో ఎక్కడైనా దాడి చేయగల సామర్థ్యం రష్యాకు ఉంటుందని నివేదికలో పేర్కొంది. సాధారణంగా అయితే అంతదూరం ప్రయోగించాలంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులను (ICBM) ఉపయోగిస్తారు. కానీ ఈ న్యూక్లియర్ మిస్సైల్ తో ఆ అవసరం లేకుండా నేరుగా ఎంతదూరంలో ఉన్న టార్గెట్స్ పైనైనా దాడి చేయవచ్చు. 

సాధారణ ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్ అంతరిక్షంలో ఒక స్థిరమైన క్షక్ష్యలో ప్రయాణిస్తాయి. వాటిని ట్రాక్ చేయడం కూడా ఈజీ. కానీ బ్యూరెవెస్ట్నిక్ 50–100 మీటర్ల ఎత్తులో మాత్రమే ఎగురుతూ కక్ష్యను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది. అందువలన దీన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. 


ప్రపంచ దేశాల ఆందోళన:

రష్యా బ్యూరెవెస్టిన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  రష్యా న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షించడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశమని మిస్సైల్ ఎక్స్పర్ట్ జెఫ్రీ లూయిస్ అన్నారు.  దీని వలన చెర్నోబిల్ ఘటన మాదిరిగా అత్యంత ప్రమాదకరమైన ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉందని అభిప్రయాయం వ్యక్తంచేశారు. 

రష్యా నుంచి ఉక్రెయిన్ విడిపోక ముందు.. అంటే ఉక్రెయిన్ లోని చెర్నోబిల్ లో 1986, ఏప్రిల్ 26న న్యూక్లియర్ రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రపంచంలో అతిపెద్ద అణు ప్రమాదంగా చెర్నోబిల్ ఘటన గురించి చెప్తుంటారు. ఈ మిస్సైల్ తో కూడా ప్రపంచానికి అలాంటి ప్రమాదం ఉందని హెచ్చిరస్తు్న్నారు. చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్‌లోని ఒక రియాక్టర్ పేలి, ఉక్రెయిన్, బెలారస్, రష్యా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో రేడియేషన్ వ్యాపించింది. రష్యా తయారు చేసిన ఈ మిస్సైల్ పై ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలోని పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అణుఒప్పందానికి కట్టుబడి ఉండాలని సూచిస్తున్నాయి.