వర్షాలు, వరదలపై మరో 2రోజుల్లో నివేదిక ఇస్తాం.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

వర్షాలు, వరదలపై మరో 2రోజుల్లో నివేదిక ఇస్తాం.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. వరదలు, వర్షాలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత గడువు కోరింది. వరదలు, నివారణ చర్యలు, ఎక్స్గ్రేషియా వంటి వివరాలపై పూర్తి నివేదికను రెండు రోజుల్లో అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. నివేదిక అందజేసిన తర్వాతే తాము వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. భారీ వరదల ప్రభావంతో మోరంచపల్లి గ్రామంలో మృతిచెందిన మరో ఇద్దరి పేర్లను మరణించిన వారి జాబితాలో చేర్చలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. మహాలక్ష్మీ, సంజీవయ్య పేర్లును కూడా మరణించిన వారి జాబితాలో చేర్చాలని పిటిషనర్ కోరారు. ఈ విషయాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

వర్షాలు వచ్చే ముందే భారీ వర్షాలు ఉన్నాయని IMD హెచ్చరించిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. ఈసారి మరింత అప్రమత్తంగా ఉండి, ప్రాణనష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తదుపరి విచారణ ఆగస్టు 22వ తేదీకి (మంగళవారం) వాయిదా వేసింది న్యాయస్థానం.