ఎక్కడ పడితెే అక్కడ కడుతుంటే ఏం చేస్తున్నారు?

ఎక్కడ పడితెే అక్కడ కడుతుంటే ఏం చేస్తున్నారు?

హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాలను అదుపు చేయడంలో జీహెచ్‌‌ఎంసీ ఫెయిల్ అవుతోందని హైకోర్టు మండిపడింది. ఎక్కడపడితే అక్కడ అక్రమ కట్టడాలు వెలుస్తుంటే జీహెచ్‌‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని,  కళ్ల ముందే కడుతున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలు జరిగిన జోన్లల్లోని ఫీల్డ్‌‌ స్టాఫ్‌‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. ఇవన్నీ చూస్తుంటే అధికారులు కావాలనే స్పందించడం లేదేమోనన్న అనుమానం వస్తోందని కామెంట్ చేసింది. పోయినేడాది ఆరు జోన్లలోని 30 సర్కిల్స్‌‌లో ఎన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు తదితర వివరాలతోఏప్రిల్‌‌ 15న జరిగే విచారణ సమయంలో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివరాలన్నీ జోన్ల వారీగా టేబుల్‌‌ రూపంలో ఇవ్వాలని జీహెచ్‌‌ఎంసీకి గురువారం చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి  కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ నోటీసులిచ్చింది.

అడ్డదిడ్డంగా కట్టి.. రెగ్యులరైజ్

కూకట్‌‌పల్లి ఏరియాలో రెండు ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుంటే వాటిని కూల్చేస్తామని జీహెచ్‌‌ఎంసీ అధికారులు బెదిరిస్తున్నారని జి.నరసింగరావు, గొట్టిముక్కల నాగేశ్వరరావు హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. రెండు అంతస్తుల భవనానికి పర్మిషన్‌‌ తీసుకుని ఐదు అంతస్తులను నిర్మించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తమ భవనాన్ని కూల్చుతామని జీహెచ్‌‌ఎంసీ ఇచ్చిన నోటీసు అమలు కాకుండా స్టే ఇవ్వాలన్న రిట్‌‌ను హైకోర్టు పిల్‌‌గా పరిగణించింది. ‘‘జీహెచ్‌‌ఎంసీ నోటీసులను సవాల్‌‌ చేస్తూ అక్రమ నిర్మాణదారులు కింది కోర్టుల నుంచి స్టేలు పొందుతారు. ఆ తర్వాత ఆ అక్రమ నిర్మాణం పూర్తవుతుంది. కింది కోర్టు స్టే ఎత్తివేతకు వెకేషన్‌‌ పిటిషన్‌‌ కూడా జీహెచ్‌‌ఎంసీ దాఖలు చేయదు. ఈలోగా ప్రభుత్వం బిల్డింగ్‌‌ రెగ్యులైజేషన్‌‌ స్కీం లాంటివి తెస్తుంది. దీంతో అడ్డదిడ్డంగా అక్రమంగా కట్టేసిన బిల్డింగ్స్‌‌కు రెగ్యులైజేషన్‌‌ కూడా లభిస్తోంది. అందుకే లోతుగా విచారణ జరుపుతాం’’ జస్టిస్‌‌ విజయ్‌‌సేన్‌‌రెడ్డి స్పష్టం చేశారు.

పీపీలను ఎందుకు నియమించట్లే

పబ్లిక్‌‌ ప్రాసిక్యూటర్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఖాళీగా ఉన్న పీపీ పోస్టులను భర్తీ చేయాలని 2020 సెప్టెంబర్‌‌లో ఉత్తర్వులిస్తే.. ఇప్పటికీ అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించింది. క్రిమినల్‌‌ కేసుల విచారణ ఏం కావాలని నిలదీసింది. పీపీ పోస్టుల భర్తీ చేయకపోవడం వల్ల పలు కేసుల విచారణ జరగడం లేదని చెప్పింది. పీపీల నియామకానికి చర్చలు జరుగుతున్నాయని, 414 పీపీ పోస్టుల్లో 212 భర్తీ అయ్యాయని హోం శాఖ లాయర్ శ్రీకాంత్‌‌రెడ్డి ఇచ్చిన సమాధానంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలనివిచారణను ఏప్రిల్‌‌ 1కి వాయిదా వేసింది. పీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రార్‌‌ జనరల్‌‌ రాసిన లెటర్‌‌ను హైకోర్టు పిల్​గా పరిగణించింది. చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమాకోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన బెంచ్ గురువారం విచారణ జరిపింది. ఒక పీపీ రెండు మూడు కోర్టుల్లో పని చేయాల్సి వస్తోందని, కేసుల విచారణ ఆలస్యం అవుతోందని, న్యాయం చేసేందుకు విఘాతం ఏర్పడుతోందని చెప్పింది. 200 పోస్టులే ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ లాయర్‌‌ శ్రీకాంత్‌‌రెడ్డి చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సగం ఖాళీగా ఉంటే.. ‘200 పోస్టులు మాత్రమే ఖాళీలు’ అని అంటారా అని ప్రశ్నించింది.