ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: సౌకర్యాలు లేవని ఎంఎన్‌ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని, వారికి ఇతర కాలేజీల్లో సీట్లను సర్దుబాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుని విద్యార్థులను జాయిన్ చేయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు మౌలిక వసతుల్లేవని చెప్పి సీట్లు రద్దు చేయడంపై ఆ కాలేజీలు హైకోర్టులో సవాల్ చేశాయి. వీటిని జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ శ్రావణ్ కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ఎన్‌ఎంసీ కమిటీ ఎదుట అప్పీల్ చేశామని, విద్యార్థులను మరో కాలేజీల్లో సర్దుబాటు చేయవద్దని విన్నవించాయి. అయితే కాలేజీల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈసారికి మాత్రమే సూపర్ న్యూమరీ సీట్లను సృష్టిస్తామని ఎన్‌ఎంసీ కోర్టుకు తెలిపింది. అడ్మిషన్లు కోల్పోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీంతో సీట్ల సర్దుబాటు పిటిషన్‌పై విచారణ ముగిసింది. ఎంబీబీఎస్‌లో 450, పీజీలో 100 సీట్లను ఎన్‌ఎంసీ రద్దు చేసింది.
