ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్​కు హైకోర్టు ఆదేశం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్​కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేషనల్‌‌ జనరల్‌‌ సెక్రటరీ బీఎల్‌‌ సంతోష్‌‌ కు మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ ను హైకోర్టు ఆదేశించింది. ఆయన పర్సనల్ ఈ–మెయిల్, వాట్సాప్ లకు నోటీసులు పంపాలని చెప్పింది. సంతోష్‌‌కు వ్యక్తిగతంగా నోటీసులు అందలేదని, ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో నోటీసులు ఇచ్చారని ఆ పార్టీ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం.. సంతోష్ తరఫున వాదించే లాయర్ ఎవరూ లేకపోవడంతో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ జనరల్‌‌ సెక్రటరీ ప్రేమేందర్‌‌ రెడ్డి, ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీ వేసిన రెండు పిటిషన్లపై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి బుధవారం విచారించారు. సిట్‌‌ తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్, అదనపు ఏజీ జె.రామచంద్రరావులు వాదించారు. ‘‘ముందుగా నిర్ణయించిన ప్రోగ్రామ్స్ కారణంగా సిట్‌‌ దర్యాప్తునకు రాలేనని సంతోష్‌‌ సిట్‌‌కు లేఖ రాశారు. కానీ ఎన్ని రోజులు గడువు కావాలో, ఎప్పుడు విచారణకు వస్తారో అందులో పేర్కొనలేదు. సిట్‌‌ దర్యాప్తుపై హైకోర్టు పర్యవేక్షణ అక్కర్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. సంతోష్‌‌ ఫోన్‌‌లో కీలక సమాచారం ఉంది. ఎవిడెన్స్‌‌లను నాశనం చేసే అవకాశం ఉంది. ఎవిడెన్స్‌‌లు నాశనం అయ్యాకే ఆయన విచారణకు వస్తారు” అని కామెంట్ చేశారు. ఆయనను అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. బీజేపీ తరఫున సీనియర్‌‌ లాయర్‌‌ ఎన్‌‌.రాంచందర్ రావు వాదిస్తూ.. ‘‘బీఎల్‌‌ సంతోష్‌‌పై ఏఏజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. నిజాయతీ గల నేత సంతోష్‌‌పై ఆరోపణలు చేయడం దారుణం. ఆధారాలను ప్రభుత్వమే సీడీలు, పెన్‌‌డ్రైవ్‌‌ రూపంలో అందరికీ రిలీజ్‌‌ చేసింది. చట్టానికి అనుగుణంగా సంతోష్‌‌ పని చేస్తారు. బాధ్యతతో గడువు కావాలని సిట్ ను కోరారు. ఆయన బిజీ నేత. ముందుగా నిర్ణయించిన ప్రోగ్రామ్స్ ఉండడంతో విచారణకు రాలేకపోయారు” అని అన్నారు. బీజేపీ తరఫునే సుప్రీంకోర్టు సీనియర్‌‌ లాయర్ వైద్యనాథన్‌‌ వాదిస్తూ.. ‘‘బీఎల్‌‌ సంతోష్‌‌ బిజీగా ఉన్నారు. సిట్‌‌ దర్యాప్తునకు గడువు కావాలని కోరారు” అని చెప్పారు. స్పందించిన హైకోర్టు.. ‘‘మీరు సంతోష్‌‌ తరఫున వాదిస్తున్నారా? 41ఎను సవాల్‌‌ చేశారా?’’ అని ప్రశ్నించింది. అయితే సంతోష్‌‌ నుంచి ఏవిధమైన సమాచారం లేదని ఆయన జవాబు చెప్పారు. ఇక సంతోష్ ను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏజీ చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. ‘‘41ఎ ప్రకారం విచారణ చేస్తామని, అరెస్టు చేయబోమని గతంలోనే సిట్‌‌ చెప్పింది. ఇప్పడు ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎలా కోరతారు? సంతోష్‌‌ నిందితుడు కాదని, సాక్షిగా లేదా అనుమానితుడిగా విచారణ చేస్తామని చెప్పారు” అని గుర్తు చేసింది.  

బెయిల్ కోసం రిట్ వేస్తం.. 

నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ లాయర్‌‌ మహేశ్ జఠ్మలానీ వాదించారు. ‘‘సిట్‌‌ దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. సిట్‌‌ ఉండాలో లేదో తేల్చాలి. ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ విషయంపై హైకోర్టు తగిన నిర్ణయం స్వేచ్ఛగా తీసుకోవాలని తెలిపింది. హైకోర్టు సిట్‌‌ దర్యాప్తును పర్యవేక్షణ చేయగలదు. గతంలో అనేక కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్పింది” అని అన్నారు. నిందితులకు బెయిల్‌‌ మంజూరు చేయాలని గురువారం రిట్‌‌ దాఖలు చేస్తామని చెప్పారు. 

మరో రెండు రిట్లు దాఖలు.. 

సిట్‌‌ తనను వేధిస్తోందని కరీంనగర్‌‌ కు చెందిన లాయర్ బి.శ్రీనివాస్‌‌ రిట్‌‌ దాఖలు చేశారు. మూడు రోజులుగా సాక్షి పేరుతో తనను సిట్‌‌ విచారిస్తోందని, తరచూ విచారణకు రావాలంటూ వేధిస్తోందని అందులో పేర్కొన్నారు. తన దగ్గర లేని విషయాల గురించి, మెటీరియల్స్‌‌ గురించి సిట్‌‌ వేధిస్తోందన్నారు. సిట్‌‌ 41ఎ నోటీసు ఇవ్వడాన్ని సవాల్‌‌ చేస్తూ అంబర్‌‌పేట్‌‌కు చెందిన లాయర్ ప్రతాప్‌‌ గౌడ్‌‌ కూడా రిట్‌‌ దాఖలు చేశారు. ఆ నోటీసును కొట్టేయాలని కోరారు. గురువారం ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేసే అవకాశం ఉంది.