ఉస్మానియా హాస్పిటల్​ను కూల్చేస్తరా.. రిపేర్లు చేస్తరా?

ఉస్మానియా హాస్పిటల్​ను కూల్చేస్తరా.. రిపేర్లు చేస్తరా?

ఉస్మానియా హాస్పిటల్​ను కూల్చేస్తరా.. రిపేర్లు చేస్తరా?
ఎక్స్​పర్ట్స్‌‌ ఒపీనియన్‌‌ తీసుకొని రిపోర్టు ఇవ్వండి
రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : ఉస్మానియా హాస్పిటల్‌‌ బిల్డింగ్‌‌ ను కూల్చివేసి మళ్లీ కొత్త బిల్డింగ్‌‌ కట్టాలా? లేక ఉన్న బిల్డింగ్‌‌కు రిపేర్లు చేసి పురాతన భవనాన్ని పరిరక్షించాలా? ఈ అంశాలపై ప్రభుత్వం.. ప్రజలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకొని రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా హాస్పిటల్​బిల్డింగ్‌‌ను కూల్చేయాలని కొందరు, కూల్చకుండా పరిరక్షణకు వీలుగా రిపేర్లు చేయాలని మరికొందరు వేర్వేరుగా వేసిన పిల్స్‌‌ పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రజాభిప్రాయంతోపాటు నిపుణుల అభిప్రాయాలు తీసుకొని రిపోర్టు ఇవ్వాలని చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ, హైకోర్టు ఆదేశించిన మేరకు ఏర్పాటైన కమిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌‌ ఐఐటీ డైరెక్టర్, ప్రభుత్వాధికారులు, పురావస్తు శాఖకు చెందిన స్ట్రక్చరల్‌‌ ఇంజినీర్​తో కూడిన కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రిపేర్లు చేసినప్పటికీ ఆ బిల్డింగ్‌‌ హాస్పిటల్‌‌ కోసం వాడేందుకు యోగ్యం కాదన్నారు.

ఇతరత్రా అవసరాలకు వాడవచ్చునని నివేదికలో కమిటీ తెలిపిందన్నారు. పిటిషనర్ల తరఫు నళినికుమార్‌‌ వాదిస్తూ, 2010లోనే హాస్పిటల్​బిల్డింగ్‌‌ యోగ్యంగా లేదని చెప్పి సర్కారు జీవో ఇచ్చిందన్నారు. తెలంగాణ స్టేట్‌‌ ఏర్పడ్డాక ఆ జీవోకు అతీగతి లేదన్నారు. రూ.200 కోట్ల ఖర్చుతో ఆస్పత్రి వెనుక ఉన్న ఆరు ఎకరాల జాగాలో 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్స్ నిర్మించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం రూ.5 కోట్లు రిలీజ్‌‌ చేసిందన్నారు. హాస్పిటల్​భవనాన్ని వేరే అవసరాలకు వాడుకొనేలా మరమ్మతులు చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనల తర్వాత ప్రభుత్వ నివేదిక నిమిత్తం కోర్టు విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.