మహిళ హత్య కేసులో వ్యక్తి యావజ్జీవ శిక్ష రద్దు   

మహిళ హత్య కేసులో వ్యక్తి యావజ్జీవ శిక్ష రద్దు   

హైదరాబాద్, వెలుగు: మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా అదనపు సెషన్స్‌‌ జడ్జి విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. కింది కోర్టులు శిక్ష విధించడానికి కేవలం నిందితుడి వాంగ్మూలం సరిపోదని..బలమైన సాక్ష్యాధారాలు కూడా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ కేసులో పదేండ్లగా జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడి జైలు నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 2014 ఏప్రిల్‌‌ 28న అప్పాయ్ పల్లి సరిహద్దులో పోలీసులు శాంతమ్మ అనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

దర్యాప్తులో మహిళను చంపింది మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కోడూరుకు చెందిన ఆటోడ్రైవర్‌‌ వడ్డే రాజు అని తేలింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం వడ్డే రాజుకు కోర్టు యావజ్జీవ శిక్షను విధించింది.  పదేండ్లుగా  జైలులో ఉన్న ఉన్న రాజు ఇటీవల హైకోర్టులో అప్పీల్‌‌ చేశాడు. అతడి పిటిషన్​ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌‌ కె. సురేందర్, జస్టిస్‌‌ జె.అనిల్‌‌ కుమార్ ల బెంచ్ విచారించింది.  కింది కోర్టు తీర్పు శరద్‌‌ బిర్జిచంద్‌‌ సరా వర్సెస్‌‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న ఐదు సూత్రాల ఉత్తర్వులకు వ్యతిరేకంగా  ఉందని పేర్కొంది. పోలీసుల పంచనామా కూడా తప్పుల తడకగా ఉందని.. మృతురాలి కొడుకు వాగ్మూలం కూడా రాజునే దోషి అని తేల్చేంత బలంగా ఏమి లేదని  వివరించింది. కింది కోర్టులు వాంగ్మూలాల ఆధారంగా శిక్ష విధించరాదని, సాక్ష్యాధారాలు కూడా కీలకమని చెప్పింది. ఇవేమి ఈ కేసులో బలంగా లేనందునా రాజుకు కింది కోర్టు విధించిన యావజ్జీవశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.