నంబర్ పనిచేయకపోతే హెల్ప్ లైన్ ఎట్లవుతది?

నంబర్ పనిచేయకపోతే హెల్ప్ లైన్ ఎట్లవుతది?

హైదరాబాద్, వెలుగు: ‘‘కరోనా హెల్ప్‌ లైన్‌ ఫోన్​ నంబర్ ఉంటే చాలదు. సరిగ్గా పనిచేయకపోతే అది హెల్ప్​ లైన్‌ ఎలా అవుతుంది. మొక్కుబడిగా హైల్ప్‌లైన్‌ ఉంటే ఎలా”అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనాపై అనుమానాలు తీర్చేందుకు ఎవరైనా 104 నంబర్‌కు ఫోన్‌ చేస్తే.. తగిన సమాచారం ఇవ్వకపోగా, సరైన జవాబు చెప్పకపోవడం ఏమిటని నిలదీసింది. కరోనా హైల్ప్‌లైన్‌ నంబర్‌ 104 అందుబాటులో లేదంటూ స్మృతి జైశ్వాల్‌ హైకోర్టులో పిల్​ వేశారు. కరోనా సింప్టమ్స్​ ఉన్నా టెస్ట్‌లు, ట్రీట్‌మెంట్‌ చేయడం లేదని పల్లె శ్రీకాంత్‌ మరో పిల్‌ దాఖలు చేశారు. వీటిని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ బొల్లం విజయసేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది. ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు కరోనా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104ను ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఎవరైనా ఫొన్‌ చేస్తే ఆన్సర్‌ చేసే వ్యక్తులు విసుక్కోకుండా, మర్యాదపూర్వకంగా చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిల్స్‌ను కూడా కరోనాపై దాఖలైన 19 పిల్స్‌తో కలిపి 24న విచారిస్తామని ప్రకటించింది.

రిజల్ట్ కాదు, వైరల్ లోడ్ ఎంతో చెప్పాలి

ఆర్టీపీసీఆర్ టెస్టులపై హైకోర్టులో పిల్

ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల రిజల్ట్ తర్వాత కరోనా పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అని చెప్పడం సరికాదని, సేకరించే శాంపిల్స్‌లో వైరల్‌ లోడ్‌ ఏ స్థాయిలో ఉందో చెబితేనే కరోనా కట్టడికి వీలవుతుందంటూ హైకోర్టులో పిల్​ దాఖలైంది. యూరోపియన్‌ జర్నల్స్‌ కథనాల ప్రకారం వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్నవాళ్లను ఐసోలేషన్‌లో ఉంచితేనే కరోనా కట్టడి అవుతుందని అడ్వొకేట్​ తీగల రాంప్రసాద్‌ ఈ పిల్‌లో పేర్కొన్నారు. సైకిల్‌ థ్రెషోల్డ్​ వాల్యూ 24 ఉంటే కరోనా సింప్టమ్స్ 8 రోజులపాటు కొద్దిగానే కనిపిస్తాయని, ఈ విషయం టెస్ట్‌ చేయించుకున్న వ్యక్తికి తెలిస్తే భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. సైకిల్‌ థ్రెషోల్డ్​ వాల్యూ 33 నుంచి 34 వరకూ ఉంటే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని, వీళ్లను ఇంట్లోనే ఉండమంటే సరిపోతుందని అన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కరోనా టెస్ట్‌ల ఫలితాల్లో సైకిల్‌ థ్రెషోల్డ్​ వాల్యూ కూడా వెల్లడించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు.