
- ఆ జాగాలో స్కూల్ లేదా కాలేజీ కట్టి భార్య పేరు పెట్టాలని వినతి
- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటనఎల్కతుర్తి,
వెలుగు: కొడుకు తనను పట్టించుకోవడం లేదని ఓ తండ్రి తన ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చాడు. తల్లిదండ్రులను పట్టించుకోని వారికి ఈ ఘటన కనువిప్పు కావాలని కోరాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మంగళవారం జరిగింది. మాజీ ఎంపీపీ.. ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గోలి శ్యాంసుందర్ రెడ్డి, గోలి వసంత భార్యాభర్తలు.
వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురి వివాహం జరిపించగా, ఆమె అమెరికాలో ఉంటున్నది. కొడుకు హనుమకొండలో నివసిస్తున్నడు. వీరికి పది ఎకరాల మామిడి తోట, ఎల్కతుర్తి, హనుమకొండలో ఇండ్లు ఉన్నాయి. 2021లో గోలి వసంత కరోనాతో చనిపోయారు. శ్యాంసుందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి హనుమకొండలోని ఇంట్లో ఉంటున్నాడు.
కొద్ది రోజుల తర్వాత కుమారుడు తన తల్లి పేరిట ఉన్న భూమిని, హనుమకొండలోని ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని శ్యాంసుందర్‌ను వేధించి, ఇంటి నుండి కొట్టి వెళ్లగొట్టాడు. దీంతో శ్యాంసుందర్ రెడ్డి ఎల్కతుర్తిలో ఉన్న ఇంటి వద్ద ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎన్ని సార్లు కొడుక్కు కబురు పంపినా అతనిలో మార్పు రాలేదని మనస్తాపానికి గురైన శ్యాంసుందర్ రెడ్డి తనకు ఉన్న మూడు ఎకరాల భూమి(సుమారు రూ. కోటీ యాభై లక్షల)ని ప్రభుత్వానికి దానంగా ఇవ్వాలని నిర్ణయించాడు.
ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారులను కలిసి సంబంధిత పత్రాలు రాయించి, సంతకాలు చేశాడు. దాని కాపీని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. ఈ మేరకు భూమికి హద్దులు నిర్ణయించి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని కొడుకులకు తన నిర్ణయంతో కనువిప్పు కలగాలని తెలిపాడు.
ఆ భూమిలో స్కూల్ లేదా కాలేజీ ఏర్పాటు చేయాలని, దానికి తన భార్య గోలి వసంత పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయమై తహసీల్దార్ ప్రసాద్‌రావును వివరణ కోరగా, శ్యాంసుందర్ రెడ్డి తన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి అందజేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వినతిపత్రం అందించాడని, ఉన్నతాధికారుల సూచనల మేరకు, భూమిపై ఎలాంటి వివాదాలు లేకపోతే హద్దులు నిర్ణయించి, భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.