సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చే దాకా వేచి చూద్దాం

సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చే దాకా వేచి చూద్దాం
  •     రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టేందుకు ఏపీ సర్కార్ టెండర్లను ఆహ్వానించటాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ల విచారణను హైకోర్టు నిరవధికంగా వాయిదా వేసింది. ఇవే అభ్యంతరాలు తెలుపుతూ కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని…మళ్లీ అదే తరహా కేసును విచారించలేమని తెలిపింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూద్దామని పిటిషనర్లకు సూచించింది. ఏపీ సర్కార్ చేపట్టే ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని కాంగ్రెస్‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌‌‌‌ రెడ్డి, నారాయణపేట ఏరియా కాంగ్రెస్‌‌‌‌ నాయకుడు జి. శ్రీనివాస్‌‌‌‌ ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం పిటిషన్ విచారణ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య వైరం ఉన్న అంశాలను సుప్రీంకోర్టే తేల్చాలని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చౌహాన్, జస్టిస్‌‌‌‌ బి. విజయసేన్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ అభిప్రాయపడింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద హైకోర్టు విచారణ చేపట్టవచ్చంటూ ప్రభుత్వం తరఫున అడినల్ ఏజీ రామచందర్ రావు కోర్టుకు సూచించారు. రాయలసీమ ప్రాజెక్ట్ టెండర్ నోటిఫికేషన్‌‌‌‌కు సంబంధించి గ్రీన్ ట్రైబ్యునల్‌‌‌‌లో పిటిషన్ వేస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ఏపీని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించిందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. టెండర్లను ఆపేందుకు ట్రైబ్యునల్ ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదని పిటిషనర్ తరఫున లాయర్ కోర్టుకు చెప్పారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది గానీ హైకోర్టుకు కాదని బెంచ్ స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదన కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపింది. రాష్ట్రాల వివాదంలో హైకోర్టు తీర్పు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్ వేస్తాయని కోర్టు తెలిపింది. ఏపీ ఏజీ సుబ్రహ్మణ్యం సైతం ఇదే పిటిషనర్లు సుప్రీంకోర్టులోనూ కేసులు వేశారని చెప్పారు. దీంతో సుప్రీంలో కేసు కొలిక్కి వచ్చే వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.