
వివాదం ఆర్టీసీ కార్పొరేషన్ లేదా 48 వేల మంది ఉద్యోగులకే పరిమితమైనది కాదు. అది 48 వేల కుటుంబాలకు చెందినదిగా పరిగణించి పట్టువిడుపు ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఉండాలి. కార్మికులను డ్యూటీలో చేర్చుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి. ఒక్కసారిగా అన్ని వేల కుటుంబాలు రోడ్డునపడితే ఎంత దయనీయంగా పరిస్థితులు ఉంటాయో కూడా ఆలోచించాలి. – హైకోర్టు
డ్యూటీలో చేరేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని, కానీ వాళ్లను డ్యూటీలో చేర్చుకునే పరిస్థితులు లేవంటూ ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ బెదిరింపు ధోరణిలో అఫిడవిట్ దాఖలు చేశారని, డ్యూటీల్లో చేరబోయే వాళ్లకు అవాంతరాలు లేకుండా చూసేలా ఆదేశాలివ్వాలని యూనియన్ కోరింది. దీనికి స్పందించిన డివిజన్ బెంచ్.. డ్యూటీలో చేర్చుకోవాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని, విజ్ఞాపన మాత్రం చేయగలమని తేల్చిచెప్పింది. వివాదం ఆర్టీసీ కార్పొరేషన్ లేదా 48 వేల మంది ఉద్యోగులకే పరిమితమైనది కాదని, అది 48 వేల కుటుంబాలకు చెందినదిగా పరిగణించి పట్టువిడుపు ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఉండాలని సూచించింది. కార్మికులను డ్యూటీలో చేర్చుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలని, ఒక్కసారిగా అన్ని వేల కుటుంబాలు రోడ్డునపడితే ఎంత దయనీయంగా పరిస్థితులు ఉంటాయో కూడా ఆలోచన చేయాలని హితవుపలికింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో వయసు మళ్లిన వాళ్లంతా ఇతర ఏ పనులు చేయలేరనే దృక్పథంలో ఉండాలని పేర్కొంది. డ్యూటీల్లో చేరేందుకు ఇదే ఆఖరు తేదీ అంటూ ఒకసారి.. ఇప్పుడు డ్యూటీల్లో చేరేందుకు సిద్ధపడ్డా చేర్చుకునేందుకు అవకాశాలు లేవని ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ సునీల్ శర్మ సాక్షాత్తు హైకోర్టులో కౌంటర్ వేసి రాజకీయ నేతను తలపించారని యూనియన్ తరఫు సీనియర్ లాయర్ డి.ప్రకాశ్‌రెడ్డి వాదించారు. అధికార పార్టీ నాయకుడి తరహాలో అఫిడవిట్ వేయడాన్ని కోర్టు తీవ్రంగా తీసుకుని కోర్టు రికార్డుల్లోకి ఎక్కించాలని కోరారు. ‘‘రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులపై 97 లక్షల మంది ప్రయాణికులు ఆధారపడ్డారు.
అంత భారీ సంఖ్యలోని ప్రజలు కష్టాలు పడకుండా ఉండాలంటే సమ్మె విరమించాలని యూనియన్‌కు సలహా ఇచ్చాం. యూనియన్ కూడా ప్రజాప్రయోజనం దృష్ట్యా సమ్మె విరమించేందుకు సుముఖతతో ఉంది. అయితే డ్యూటీల్లో చేరేందుకు వెళితే తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి” అని ప్రకాశ్‌రెడ్డి వాదించారు. 1963లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ మేరకు సమ్మెలో పాల్గొన్న వారందరినీ విధుల నుంచి తప్పించేందుకు వీల్లేదని, సమ్మె లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఉద్యోగంలో ఉండే హక్కు ఉంటుందని ఆ రూలింగ్ చెబుతోందని ప్రకాశ్‌రెడ్డి గుర్తు చేశారు. ఆర్టీసీ విభజన 2016లో జరిగితే అంతకు ముందే ఎస్మా జీవో ఇచ్చినట్లుగా టీఎస్ ఆర్టీసీ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ వాదనలపై మాట్లాడిన డివిజన్ బెంచ్.. హైకోర్టుకు అనూహ్య అధికారాలు ఉన్నాయని, దాన్ని ఉపయోగించి కమిటీ వేయవచ్చని, వేస్తే రేపు కూడా ఆర్టీసీ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందన్న ఆశ లేదని, అది ఎంతగా అంటే ఇసుక రేణువులో సగం మందమైనా లేదని పేర్కొంది. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరులోనే రేపు కమిటీ దగ్గర కూడా వ్యవహరిస్తే చివరికి కాలయాపన జరుగుతుందని, అందుకే ఆ విశేషాధికారాలను వినియోగించలేకపోతున్నామని తేల్చిచెప్పింది.