ఎవ్వరినీ వదలొద్దు..లాయర్ దంపతుల హత్యలపై హైకోర్టు సీరియస్

ఎవ్వరినీ వదలొద్దు..లాయర్ దంపతుల హత్యలపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్, వెలుగు: ‘‘నడిరోడ్డుపై పట్టపగలు లాయర్ దంపతులను కిరాతకంగా చంపేశారు. ప్రభుత్వంపై నమ్మకం తగ్గే ఘటన ఇది. ప్రజలంతా రాష్ట్ర సర్కార్‌‌ వైపు చూస్తున్నారు. జనం నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది. ఎవ్వరినీవదలొద్దు’’  అని హైకోర్టు కామెంట్ చేసింది. లాయర్ దంపతులు వామన్​రావు, నాగమణి హత్యలపై న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకుని విచారించింది. హత్యలపై ఆధారాలు సేకరించి నిర్ణీత వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాలని, నిందితులను అరెస్ట్‌‌ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలను మార్చి 1న జరిగే విచారణలో నివేదించాలని గురువారం చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీ, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశించింది. ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

అధికారుల చిత్తశుద్ధి విచారణలో తేలుతది

ప్రజల హక్కుల రక్షణ కోసం పోరాటం చేసే లాయర్లు.. కిరాతకుల చేతుల్లో హత్యకు గురికావడం అందరి మనసుల్ని కలచివేస్తోందని హైకోర్టు చెప్పింది. ‘‘లాయర్ల హత్యలు చట్టాన్ని అవహేళన చేయడమే. ఈ కేసు విచారణలో అధికారుల చిత్తశుద్ధి ఏంటో తేలుతుంది. హంతకుల్ని పట్టుకోవడం, చట్ట ప్రకారం శిక్షలు పడేలా చేసినప్పుడే పాలకుల విశ్వసనీయత నిలుస్తుంది. ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్థకం కారాదు’’ అని కామెంట్ చేసింది. దర్యాప్తులో ఏ చిన్న ఆధారాన్నీ వదలొద్దని సూచించింది. హంతకులు తప్పించుకోకుండా అన్ని దారులనూ మూసేయాలని, ఎవ్వరినీ వదలొద్దని చెప్పింది.

లోకల్​ పోలీసులపై ఆరోపణలు

విచారణ సందర్భంగా కొందరు లాయర్లు కల్పించుకుని.. ఈ మర్డర్ల కేసులో లోకల్‌‌ పోలీస్‌‌లపై ఆరోపణలున్నాయని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. కేసు ప్రాథమిక దశలో ఉందని, ఇప్పుడే ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని విడిగా పిల్ వేసుకోవాలంది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. జంట హత్యలను సర్కారు తీవ్రంగా పరిగణిస్తోందని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామన్నారు. జోక్యం చేసుకున్న చీఫ్‌‌ జస్టిస్‌‌.. ‘‘హామీ అమలు చేయడం ఒక ఎత్తు. నిర్ణీత వ్యవధిలో అమలు చేయడం మరో ఎత్తు. నిర్ణీత వ్యవధిలో చర్యలు తీసుకోవాలి” అని ఆదేశించారు.

గురువారం కేసులన్నీ వాయిదా

లాయర్ దంపతుల హత్యలకు నిరసనగా కోర్టు డ్యూటీలను బహిష్కరిస్తున్నామని, గురువారం విచారణకు వచ్చిన కేసుల్లో కక్షిదారులకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వొద్దని చీఫ్‌‌ జస్టిస్‌‌ హిమా కోహ్లీని హైకోర్టు బార్‌‌ అసోసియేషన్‌‌ అధ్యక్షుడు సూర్యకరణ్‌‌రెడ్డి కోరారు. ఆ విజ్ఞప్తిపై సీజే సానుకూలంగా స్పందించారు. గురువారం విచారణ జాబితాలోని కేసులను వాయిదా వేస్తున్నట్లు డివిజన్‌‌ బెంచ్‌‌ ప్రకటించింది.