కొత్త అసెంబ్లీ కడితే తప్పేంటి?: హైకోర్టు

కొత్త అసెంబ్లీ కడితే తప్పేంటి?: హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సాధించుకున్న తెలంగాణలో కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ను కూల్చి కొత్త అసెంబ్లీ కట్టడంపై దాఖలైన పిల్​పై బుధవారం విచారణ జరిపింది. ‘‘ఇప్పుడున్న అసెంబ్లీ చాలడం లేదని సర్కార్‌‌ చెబుతోంది. భావితరాలకు ఉపయోగపడేలా అన్ని హంగులతో కొత్తగా కట్టడం వల్ల నష్టం ఏముంది. హర్యానా–పంజాబ్‌‌ విడిపోయినప్పుడు అమృతసర్, పాటియాల వంటి సిటీలు ఉన్నా కొత్తగా చండీఘర్‌‌ను కట్టారు. భోపాల్‌‌లో అసెంబ్లీ కట్టారు. కర్నాటకలోనూ కట్టారు. రాష్ట్రాలు విడిపోకున్నా కొత్త అసెంబ్లీలు కడుతున్నరు. అలాంటప్పుడు కొత్త రాష్ట్రంలో కడితే ఎట్లా తప్పు అవుతుంది” అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ షమీమ్అక్తర్‌‌లతో కూడిన డివిజన్ బెంచ్.. పిటిషనర్​తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘‘కొత్త అసెంబ్లీ కట్టేందుకు మాకు అభ్యంతరం లేదు. పురాతనమైన ఎర్రమంజిల్‌‌ బిల్డింగ్‌‌ కూల్చేయాలనే నిర్ణయాన్నే మేం ప్రశ్నిస్తున్నాం. చట్ట ప్రకారం చేయకపోడాన్ని సవాల్‌‌ చేస్తున్నాం” అని పిటిషనర్‌‌ లాయర్‌‌ బదులిచ్చారు. హెచ్ఎండీఏ చట్టం ప్రకారం ఆ భవనాన్ని కూల్చరాదన్నారు. చట్టం ఉన్నప్పుడు దాన్ని అమలు చేయాలన్నారు.