- హైదరాబాద్‌లో చంపేసి ఏపీలోని గోదావరి నదిలో డెడ్‌బాడీ డంప్
- కోనసీమ జిల్లా యువకుడితోపాటు మరో ఇద్దరి అరెస్ట్
నాచారం, వెలుగు: కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ నాచారానికి చెందిన మహిళ హత్యకు గురైనట్లు తేలింది. ఆమె డెడ్‌బాడీని ఏపీలోని కోనసీమ జిల్లాలో గుర్తించారు. ఒంటిమీదున్న బంగారం కోసం ఆమె ఇంట్లో కిరాయికి ఉండే ఏపీకి చెందిన క్యాబ్డ్రైవరే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ ధనుంజయ వెల్లడించారు.
నాచారం పరిధిలోని బాబానగర్ మల్లాపూర్‌లో నివాసం ఉంటున్న సూరెడ్డి సుజాత (65) డిసెంబర్ 19న మిస్సయినట్లు ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న మడ్డు అంజిబాబు(33)ను విచారించగా అసలు విషయం బయటపడింది. రెండు నెలలుగా వృద్ధురాలు సుజాత ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అంజిబాబు.. ఆమె మీదున్న బంగారు నగలు దోచుకోవాలని ప్లాన్ చేశాడు.
డిసెంబర్ 19న సుజాత ఇంట్లోకి వెళ్లి ఆమెను గొంతునులిమి చంపేసి ఆభరణాలు తీసుకున్నాడు. ఆపై అతడి సహచరులు నక్కంటి యువరాజ్(18), నూకల దుర్గారావు(35)తో కలిసి ఆమె మృతదేహాన్ని కారులో ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తీసు కెళ్లి అక్కడ గోదావరి నదిలో పడేశారు. నిందితులను కోనసీమ జిల్లా రాజోలు మండలంలోని పొదిలాడ జంక్షన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 బంగారు గాజులు, ఒక గొలుసు, రెండు జతల చెవి దుద్దులు మొత్తం 10 తులాల బంగారం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
