రాష్ట్రానికి రావాల్సిన 2వేల 641 కోట్ల రూపాయల ఐజీఎస్టీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు ఆర్థికమంత్రి హరీష్ రావు. కరోనా సమయంలో ఈ మొత్తం రాష్ట్రాలకు అవసరమని చెప్పారు. వచ్చే నెల ఐదో తేదీన జరిగే.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందే.. ఐజీఎస్టీ చెల్లింపులకు సిఫారసు చేయాలని.. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కన్వీనర్ సుశీల్ కుమార్ మోడీని కోరారు హరీష్. ఐజీఎస్టీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఐజీఎస్టీ సెటిల్మెంట్ పై మంత్రులు చర్చించారు. ఐజీఎస్టీ కన్వీనర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి… బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు.
కరోనా సమస్యలతో రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున.. ఈ సమయంలో ఐజీఎస్టీ నిధులొస్తే కొంత ఊరట కలుగుతుందన్నారు హరీష్ రావు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే.. మూడు నెలలు ఆగాల్సి వస్తుందని చెప్పారు. కాబట్టి వెంటనే ఐజీఎస్టీ నిధులు రాష్ట్రాలకు అందేలా సిఫారసు చేయాలని సూచించారు. హరీష్ సూచనకు సానుకూలంగా స్పందించిన ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కన్వీనర్ సుశీల్ కుమార్ మోడీ.. అక్టోబర్ 1న తిరిగి సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు.
2018 నుంచి తెలంగాణతో పాటు మరో 16 రాష్ట్రాలకు.. 25వేల 58 కోట్ల ఐజీఎస్టీ నిధులు రావాల్సి ఉంది. ఎనిమిది రాష్ట్రాల నుంచి వసూలు చేయాల్సిన వెయ్యి 15 కోట్లను.. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అడ్జస్ట్ చేయాలని కన్వీనర్ కు సూచించారు హరీష్. 18 రాష్ట్రాల నుంచి రికవరీ చేయాల్సిన కాంపెన్సేషన్ ఫండ్ ను .. ఆ రాష్ట్రాలకు భవిష్యత్తులో చెల్లించే పరిహార మొత్తంలో.. అడ్జస్ట్ చేయాలని సూచించారు హరీష్.
ఇక బీఆర్కే భవన్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావును కలిశారు టీఎన్జీఓ నేతలు. కరోనా కాలంలో 3 నెలలు కట్ చేసిన 50శాతం జీతాలను.. మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నెలలో దసరా ఉన్నందున వెంటనే ఇవ్వాలని కోరారు నేతలు. విషయాన్ని సీఎం దృష్టకి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి.