
ఒక టీనేజర్ రాత్రంతా పబ్‌లో గడిపి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు పబ్ నుంచి ఇంటికి వస్తాడు. ఒక పిల్లవాడు తన తాతగారి తలుపు గట్టిగా తడతాడు. మరొక పిల్లవాడు తన గదిలోనే.. తనను తాను బందీగా చేసుకుని తెల్లవారుజామున రెండు గంటలైనా స్క్రీన్‌కు కళ్లు అతుక్కుపోయి నిద్రపోవడానికి నిరాకరిస్తాడు. మరోవైపు వారి తల్లిదండ్రులు గదిలో కూర్చుని తమ సొంత గాడ్జెట్‌లను చూస్తూ చాలా బిజీగా ఉంటారు.
పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా, వారి గురించి పట్టించుకోకుండా లేదా అధ్వానంగా వ్యవహరిస్తూ... ‘స్వేచ్ఛ’ పేరుతో తమ పిల్లలకు ఇవన్నీ సాధ్యమయ్యేలా చేస్తున్నారు. భారతదేశంలోని ఎన్నో నగరాలు, పట్టణాలు, చివరకు చిన్ని చిన్న కమ్యూనిటీస్‌లో కూడా తమ సంతానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నేను చాలా తరచుగా చూస్తున్నాను.
ఒకవిధంగా మనం నిశ్శబ్ద అంటువ్యాధి మధ్యలో ఉన్నాం. ఈ సమస్యను పరిష్కరించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాం. ‘ నిర్లక్ష్య పేరెంటింగ్’ ఇది పైకి కనిపించేంత చిన్న సమస్య కాదు. ఇది సర్వత్రా అంటువ్యాధిలా విస్తృతంగా వ్యాపిస్తోంది.
పిల్లల పెంపకం అనేది కేవలం ఒక టైటిల్ కాదు. పిల్లల పెంపకం ఒక పవిత్రమైన బాధ్యత. ఒక బిడ్డ పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ కూడా ఉంటారు. పిల్లలకు జన్మనివ్వడంతో పాటు నైతిక విలువలను పెంపొందించడం, వారికి మార్గనిర్దేశం చేయడం, తమ సంతానాన్ని రక్షించడం, విలువలను పెంపొందించడం అనే నైతిక బాధ్యత వస్తుంది.
అయితే, నేడు సమాజంలో మనం చూస్తున్నది ఆ మోరల్ డ్యూటీని ప్రమాదకరమైన రీతిలో విస్మరిస్తుడటం. భారతదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, సెమీ -అర్బన్ ఏరియాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్లో విషయ పరిజ్ఞానం పట్ల అవగాహన, ఇంటెన్షన్ పెంచడంలో చాలా పరధ్యానంగా వ్యవహరిస్తున్నారు.
తమ సంతానంలో నైతికత పెంపొందించడంలో ఎటువంటి ఆసక్తి లేకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తల్లిదండ్రుల పాత్ర నెమ్మదిగా.. పాఠశాలలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, సోషల్ మీడియాకు అవుట్సోర్స్గా మారుతోంది. ఈ నిర్లక్ష్య మూల్యం పిల్లలే కాదు, మొత్తం సమాజం చెల్లిస్తోంది.
జీవిత పాఠాలు నేర్పాలి
ఒక విషయం నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తమ గాడ్జెట్‌లకు బానిసలై స్క్రీన్‌లకు అతుక్కుపోతున్నారు. వాటినుంచి బయటపడి పైకి చూడలేక తమ సంతానం భావోద్వేగ క్షీణతలోకి జారిపోతున్నట్లు గమనించలేకపోతున్నారు. పిల్లలకు విలువలతో కూడిన ఎడ్యుకేషన్ అందించేందుకు పేరెంట్స్తమ సమయం లేదా శక్తి ఇన్వెస్ట్ చేయడంలేదు. స్పృహతో కూడిన రోల్-మోడలింగ్ లేదు. అత్యంత కీలకమైన జీవిత పాఠాలు నేర్పడం లేదు. -
గౌరవం, క్రమశిక్షణ, కరుణ, నిజాయితీ మొదలైన అమూల్యమైన విషయాలను ఇంట్లో బోధించటం లేదు. మరోవైపు కొంతమంది నిర్లక్ష్యపు తల్లిదండ్రులు అజ్ఞానంగా నైతిక దిక్సూచి, జవాబుదారీతనం లేని బాహ్య శక్తుల ద్వారా పిల్లవాడు ఎదిగేందుకు అనుమతిస్తున్నారు.
ఇది ప్రగతిశీలతేనా?
ప్రగతిశీలత అని తప్పుగా భావించే కొత్త జాతి అనుమతిని మనం చూడటం ప్రారంభించాం. చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు తమ టీనేజర్లను రాత్రిపూట పార్టీలు చేసుకోవడానికి, రెచ్చగొట్టేవిధంగా దుస్తులు ధరించడానికి అనుమతిస్తున్నారు. సాధారణ డేటింగ్, మద్యం, పొగ తాగడానికి, మాదకద్రవ్యాలను తీసుకోవడానికి అనుమతించడం శోచనీయం. ఇదంతా ఒకవిధంగా ‘ఉదారవాద’ లేదా ‘కూల్’ కు సంకేతం అని నమ్ముతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ద్వారా తమ ఊహలను నిజం చేసుకుంటూ వారిని స్వేచ్ఛ అనే తప్పుడు ఆలోచనలోకి నడిపిస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ గ్రహించని విషయం ఏమిటంటే నియంత్రణ లేని స్వేచ్ఛ విముక్తి కాదు. అది గందరగోళంలోకి జారిపోయే ఒక వాలు లాంటింది.
ప్రైవసీ పేరిట మితిమీరిన స్వేచ్ఛ
ఉమ్మడి కుటుంబం లేని ఇళ్లలో నేటి పిల్లలు పెరుగుతున్నారు. గ్రాండ్ పేరెంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భోజన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి మాట్లాడుకోవడం అనేది అంతరించిపోతున్నది. వారి మధ్య సంభాషణలు కరువైపోతున్నాయి. పిల్లలు హెడ్‌ఫోన్‌లు ఆన్ చేసి, స్క్రీన్‌లు ఆన్ చేసి వాటిని కళ్లప్పగించి చూస్తూ మనస్సులను వేరే చోట ఉంచుకుని ఒంటరిగా తింటున్నారు. ఒకరిని ఒకరు కళ్లతో చూసుకోవడం కూడా విస్మరిస్తున్నారు.
స్క్రీన్‌లకు అతుక్కుపోయి తెల్లవారుజామున 3 గంటలకు నిద్రపోతున్నారు. ఉదయమే నిద్ర లేవాల్సిన వారు మధ్యాహ్నం మేల్కొంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ తలుపు తట్టిన క్షణంలో ‘ప్రైవసీ’ అని అరుస్తారు. మానసిక హడావుడి, భావోద్వేగ డిస్‌కనెక్ట్, సాంకేతికత -ప్రేరిత నిర్లిప్తత సంస్కృతి సాధారణంగా మారిపోతున్నది. ఈ పరిణామం ముఖ్యంగా 12 నుంచి 20 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో ఎక్కువగా కనిపిస్తోంది.
తప్పు చేయొద్దు
ఇంట్లో గౌరవం నేర్చుకోని పిల్లలు.. పనిలో నీతిలేని నిపుణులుగా, పౌరజ్ఞానం లేని పౌరులుగా, నమ్మలేని, సంబంధాలను నిలబెట్టుకోలేని భాగస్వాములుగా మారుతున్నారు. యుక్తవయస్సులో పెరుగుతున్న దూకుడు నుంచి పెద్దలలో నెలకొన్న భావోద్వేగ అస్థిరత వరకు, పేలవమైన ఉత్పాదకత , శ్రామిక శక్తిలో పెరిగిన మానసిక ఆరోగ్య సమస్యల వరకు ఎదురవుతున్న సామాజిక పరిణామాలు అపారమైనవి. మీరు ఈ వైకల్యాల మూలాలను ట్రాక్ చేస్తే అవి పాఠశాల లేదా ప్రభుత్వ విధానంతో కాకుండా, తమ పేరెంటింగ్ పాత్రను పోషించడం మానేసిన తల్లిదండ్రుల నుంచి వైకల్యాలు ప్రారంభమవుతున్నాయని గుర్తిస్తారు.
జవాబుదారీతనంతో కూడిన స్వేచ్ఛనివ్వాలి
సామాజిక పరిణామానికి తల్లిదండ్రుల పరిణామం అవసరం తప్ప తల్లిదండ్రుల పలాయనవాదం కాదు. జవాబుదారీతనం లేకుండా పిల్లలకు ‘స్వేచ్ఛ’ ఇవ్వాలి అనే ఆలోచన సరైంది కాదు. నిజమైన పెంపకం అంటే బాధ్యతతో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి. ఇది సాధికారత, అర్హత మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం గురించి. అవసరమైనప్పుడు ఆత్మవిశ్వాసంతో ‘వద్దు’ అని చెప్పే ధైర్యంతోపాటు, ఎందుకు ‘నో’ అని చెప్పామని వివరించే జ్ఞానం కలగజేస్తోంది.
తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయడం, క్రమశిక్షణ ఇవ్వడంలో విఫలమైన తల్లిదండ్రులు ప్రగతిశీలులు కాదు. వారు బాధ్యతారహితంగా ఉన్నారని గ్రహించాలి. ఈ విషయాన్ని మనం ఆశావహ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. మన పిల్లలలో మనం పొందుపరిచే విలువలు ప్రైవేట్ ఎంపికలు కావు. అవి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్. అవి మన పని ప్రదేశాల స్వభావాన్ని, మన పాలనను, మన సామాజిక నిర్మాణం, మన జాతీయ భవిష్యత్తును రూపొందిస్తాయి.
తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవాలి
ఎందుకంటే నిర్లక్ష్యపు తల్లిదండ్రుల వల్ల కలిగే నష్టం కేవలం ఒక పనిచేయని కుటుంబానికి మాత్రమే కాదు, అది మొత్తం ఒక తరాన్ని ప్రభావితం చేస్తుంది. దిశానిర్దేశం లేకుండా, వాస్తవ జీవితం నుంచి విడిపోయి పెరగడం ప్రమాదకరం. జాతి నిర్మాణంలో తల్లిదండ్రులు బాధ్యతగా ముందు వరుసలో ఉండాలి. బ్రోకెన్ హోమ్స్, ఆబ్సెంట్ పేరెంట్స్‌తో మనం గొప్ప సమాజాన్ని నిర్మించలేం. ఇది పాసింగ్ ఫేజ్ అని పేరెంట్స్ నటించడం మానేయాల్సిన సమయం ఇది.
ఇది సామాజిక నైతిక క్షీణత, ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రాథమిక నైతికత, భావోద్వేగ లంగరుగా తమ పాత్రను తిరిగి పోషించాలి. పిల్లల్లో క్రమశిక్షణను పెంపొందించండి. పిల్లలతో హృదయపూర్వకంగా మాట్లాడండి. మంచి ప్రవర్తనతో పిల్లలకు తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు మీతిమీరిన స్వేచ్ఛకు హద్దులు నిర్ణయించకపోతే ఇంకెవరు నిర్ణయిస్తారు?
‘ఈ తరం ఇలాగే ఉంది’ అనడం సోమరితనం
ఈ మధ్య నేను తరచుగా వింటున్న ఒక ప్రమాదకరమైన, ఓటమివాద పదబంధం ఒకటి ఉంది. - అదేమిటంటే.. ‘ఈ తరం ఇలాగే ఉంది’ అని చాలామంది తల్లిదండ్రులు అంటున్నారు. తమ ప్రమేయం లేకపోవడాన్ని క్షమించుకోవడానికి ఉపయోగించే సోమరితనంతో కూడిన లొంగిపోయే ప్రకటన ఇది. ఈ ధోరణి పైకి ఎదుగుతున్న దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాలలో ఎక్కువగా కనిపిస్తోంది.
పిల్లల్లో సత్ప్రవర్తన లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కోవడానికి, విలువలను పెంపొందించడానికి బదులుగా చాలామంది తల్లిదండ్రులు పలాయనవాదాన్ని అంగీకరిస్తున్నారు. తమ పిల్లలను నియంత్రణ లేకుండా, వారిపై ఎటువంటి పర్యవేక్షణ లేకుండా పెరగనిస్తారు. మునుపటి తరం అనుభవాలను వదులుకున్న ఏ తరం కూడా ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు.
- కె. కృష్ణ సాగర్ రావు,నేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ చైర్మన్ -