100 మంది అనుచరులతో వచ్చి యువతి ఇంటిపై దాడి

100 మంది అనుచరులతో వచ్చి యువతి ఇంటిపై దాడి
  • వంద మందితో వచ్చి కట్టెలు, రాళ్లతో దాడి చేసిన యువకుడు 
  • యువతి తండ్రి, బంధువులపై దాడి.. ఇల్లు, 10 కార్లు ధ్వంసం
  • పెండ్లి చూపుల టైమ్​లోనే కిడ్నాప్  
  • క్షేమంగా ఇంటికి చేరిన అమ్మాయి.. నిందితుడు నవీన్ రెడ్డితోపాటు మరో10 మంది అరెస్ట్  

హైదరాబాద్‌‌, వెలుగు: రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఓ యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తనను పెండ్లి చేసుకోవడంలేదన్న కక్షతో రెచ్చిపోయిన ఓ యువకుడు దాదాపు100 మంది అనుచరులతో వచ్చి యువతి ఇంటిపై దాడి చేశాడు. కట్టెలు, రాళ్లతో దాడి చేస్తూ సినిమా తరహాలో బీభత్సం సృష్టించారు. యువతి తండ్రితోపాటు అడ్డొచ్చిన వారి తలలు పగులగొట్టారు. ఇంట్లో ఫర్నిచర్‌‌‌‌ను, పదికి పైగా కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. శుక్రవారం యువతి పెండ్లి చూపులు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన 
చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన యువతి బంధువులు నిందితుడి ఇంటిని జేసీబీతో ధ్వంసం చేశారు. అతని టీ పాయింట్ ను దగ్ధం చేశారు. యువతిని కాపాడాలంటూ రోడ్డుపై బైఠాయించారు. చివరకు యువతి క్షేమంగా ఇంటికి చేరింది. యువకుడితో పాటు10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.


పెండ్లి చెయ్యాలంటూ బ్లాక్ మెయిల్ 

నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన కొడుదుల నవీన్‌‌‌‌ రెడ్డి(29) అబ్దుల్లాపూర్ మెట్‌‌‌‌ మండలం మన్నెగూడలో నివాసం ఉంటున్నాడు. మిస్టర్ టీ ఫ్రాంచాయిజర్‌‌‌‌‌‌‌‌గా బిజినెస్ చేస్తున్నాడు. సుమారు 400 స్టాల్స్‌‌‌‌ను ఆపరేట్‌‌‌‌ చేస్తున్నాడు. పుల్లారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయి(24)తో పరిచయం చేసుకున్నాడు. యవతితో తాను కలిసి దిగిన ఫోటోలను ఆమె తండ్రికి పంపిస్తూ, తమకు పెండ్లి చేయాలంటూ నవీన్ రెడ్డి తరచూ బ్లాక్ మెయిల్ చేసేవాడు. అయినా, యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఓ ఎన్ఆర్ఐ సంబంధం రావడంతో పెండ్లి చేసేందుకు యువతి తండ్రి సిద్ధమయ్యాడు. తమ బిడ్డ జోలికి రావద్దంటూ నవీన్ రెడ్డిని పలుమార్లు హెచ్చరించారు. పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ తర్వాత కూడా నవీన్ రెడ్డి వేధింపులు ఆగకపోవడంతో ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో యువతి పెండ్లిని ఎలాగైనా అడ్డుకోవాలని నవీన్ రెడ్డి ప్లాన్ వేశాడు. నిరుడు ఆగస్ట్ 4న ఆమెతో తనకు పెండ్లి అయిందంటూ రంగారెడ్డి జిల్లా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ ఫైల్‌‌‌‌ చేశాడు. గతంలో తన ఇన్సూరెన్స్ పాలసీలో నామినీగా ఆ యువతి పేరును రాయించిన నవీన్.. ఆ డాక్యుమెంట్ నే ఎవిడెన్స్ గా పెట్టాడు. కోర్టు ద్వారా యువతి తండ్రికి లీగల్ నోటీస్ పంపించాడు. శుక్రవారం ఆ యువతికి పెండ్లి చూపులు అని తెలుసుకున్న నవీన్ రెడ్డి.. బంధువులు అంతా ఉండగానే తన ఫ్రెండ్స్‌‌‌‌, అనుచరులతో వచ్చి దాడి చేశాడు. యువతిని కిడ్నాప్‌‌‌‌ చేసి తీసుకెళ్ళారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సెర్చ్‌‌‌‌ చేశారు. చివరకు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో యువతి నుంచి తండ్రికి ఫోన్ వచ్చింది. దీంతో టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు యువతిని రెస్క్యూ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. నవీన్‌‌‌‌ రెడ్డితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. 

పక్కా ప్లాన్ చేసి కిడ్నాప్

యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను కిడ్నాప్ చేసిన వారిలో 8 మందిని అరెస్ట్ చేశాం. పక్కాగా ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు. ఇంట్లో జరిగిన బీభత్సంతో పాటు ఆమెను కిడ్నాప్ చేసిన విధానంలో   స్వల్ప గాయాలయ్యాయి.ఆమెను కొట్టారు, భయపెట్టారు. యువతి షాక్​లో ఉంది. మాట్లాడే స్థితిలో లేదు. పట్టుబడ్డ నిందితులను విచారిస్తున్నాం. మిగతా వాళ్లని పట్టుకుంటాం.
- సుధీర్ బాబు, అడిషనల్ సీపీ, రాచకొండ