ఎండుతున్న పంటను కాపాడుకునే ప్రయత్నంలో యువ రైతు బలి

ఎండుతున్న పంటను కాపాడుకునే ప్రయత్నంలో యువ రైతు బలి

జనగామ, వెలుగు : సాగు నీటి కరువు ఓ యువ రైతు కుటుంబాన్ని ఆగం చేసింది. ఎండుతున్న వరి పంటను కాపాడుకునే ప్రయత్నంలో మోటారు పంపు సెట్టు సదురుతూ కరెంట్​షాక్​తో ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన జనగామ మండలం అడవికేశవాపూర్​లో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన గూడూరు యాదయ్య, సుశీల దంపతుల చిన్న కొడుకు గూడురు రాజు (27) తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. ప్రతీ యేడు లాగే ఈ సారి కూడా యాసంగి సీజన్​ లో రెండెకరాల్లో వరి వేశారు. పంట పొట్టదశలో ఉండగా నీటి అవసరం ఎక్కువైంది. పెరుగుతున్న ఎండలతో పంట ఎండిపోకుండా కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి పొలం సమీపంలోని బొమ్మకూరు రిజర్వాయర్​లో అడవి కేశవాపూర్​కు చెందిన సుమారు 20 మంది రైతులు మోటారు పంపు సెట్లు బిగించుకుని పొలాలకు నీళ్లు పారించుకుంటున్నారు.  గతంలో రిజర్వాయర్​లో సరిపడా నీళ్లు ఉండడంతో మోటార్లకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం దేవాదుల నుంచి నీటి విడుదల లేకపోవడంతో రిజర్వాయర్​లో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో కాలువలో వేసుకున్న పంపు సెట్టు పైపులు తరుచుగా ఒండులో చిక్కుకుంటున్నాయి. దీంతో పదే పదే వాటిని అటూ ఇటూ సదురుతూ ఫుట్​వాల్​ బుడ్డీలను జరుపుతూ రన్​ చేస్తున్నారు. ఇదే క్రమంలో సోమవారం మధ్యాహ్నం  మోటారు సతాయించడంతో యాదయ్య చిన్నకొడుకు గూడూరు రాజు(27) నీళ్లలోకి దిగి సదరబోతుండగా కరెంట్​షాక్​ కొట్టింది. రాజు నీళ్లలో ఉండడం మోటార్​ షాక్​ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య దీప, కొడుకు ప్రమోద్, బిడ్డ హన్సిక ఉన్నారు.


నీళ్లిడిస్తే నా బిడ్డ బతికెటోడు 

సాగునీటి సమస్యే నా బిడ్డ పానం తీసింది. దేవాదుల నీళ్లు ఎత్తిపోస్తమని గొప్ప గొప్ప మాటలు చెప్పి మోసం చేసిన్రు..నీళ్లు లేక పంట ఎండిపోతదని నా కొడుకు తండ్లాడిండు. మోటర్ ​సదురుతూ షాక్​ కొట్టి సచ్చిపోయిండు..సర్కారు నీళ్లిడిస్తే   నాకు కడుపు కోత ఉండేది కాదు. 
- యాదయ్య, మృతుడి తండ్రి