మై హోం భుజాలో ఎన్ఆర్ఐ సూసైడ్.. ఆర్థిక ఇబ్బందులే కారణం?

మై హోం భుజాలో ఎన్ఆర్ఐ సూసైడ్.. ఆర్థిక ఇబ్బందులే కారణం?

గచ్చిబౌలి, వెలుగు: ఎన్ఆర్ఐ సూసైడ్ చేసుకున్న ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్​స్పెక్టర్ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన జక్కిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి(46) ఉద్యోగ నిమిత్తం 20 ఏండ్ల కిందట ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 4 నెలల కిందట హైదరాబాద్ కు  వచ్చాడు. బయోడైవర్సిటీ పార్కు వెనుకాల ఉన్న మైహోం భుజా అపార్ట్ మెంట్ బీ బ్లాక్​లో ప్లాట్ నం.1401లో ఒంటరిగా ఉంటున్నాడు. భార్య విడాకులు ఇవ్వడంతో విష్ణువర్ధన్ రెడ్డి ప్లాట్ లో ఒక్కడే ఉంటున్నాడు. 

మంగళవారం సాయంత్రం అతడి ప్లాట్ కు ఓ వ్యక్తి వచ్చాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరేసుకుని కనిపించాడు. దీంతో ఆ వ్యక్తి వెంటనే అపార్ట్ మెంట్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించాడు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విష్ణువర్ధన్ రెడ్డి డెడ్​బాడీని ఉస్మానియాకు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

విష్ణవర్ధన్ రెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని.. అతడి తల్లిదండ్రులు గుంటూరులో ఉన్నారని, వారికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అతడి తల్లిదండ్రులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో పలు బిజినెస్​లు చేసి అప్పుల పాలయ్యాడని.. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.