రైనా బంధువులను హత్య చేసిన దోపిడీ దొంగ ఎన్‌కౌంటర్

రైనా బంధువులను హత్య చేసిన దోపిడీ దొంగ ఎన్‌కౌంటర్

భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన దోపిడీ దొంగ రషీద్‌‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ లోని షాపూర్ లో ఈ ఘటన జరిగింది.  ఆగస్టు 19న  2020లో పఠాన్‌కోట్‌లోని క్రికెటర్‌ సురేశ్‌ రైనా అత్త, మామ ఇంట్లో రషీద్‌ దొంగతనం చేశాడు. అయితే  నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేశ్‌ రైనా మామ అశోక్‌ కుమార్‌, అత్త ఆశా, బావమరిది కౌశల్‌ కుమార్‌లను రషీద్‌ తీవ్రంగా కొట్టాడు. దీంతో బావమరిది అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆశా, కౌశల్‌  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.  ఈ కేసులో ఇద్దరు నిందితులను 2022 సెప్టెంబరులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా రషీద్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అప్పటికే రషీద్‌ పరారీలో ఉన్నాడు. 

రైనా అత్తమామ, బావమరిదిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అప్పటి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ట్విట్టర్ ద్వారా కోరాడు. దీంతో ఈ కేసును సిట్ కు  అప్పగించారు. ఈ హత్యల కేసులో నిందితులను అరెస్ట్ చేసినా.. ప్రధాన నిందితుడు రషీద్‌ మాత్రం దొరకలేదు. దీంతో రషీద్ ను  మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించారు. రషీద్  తలకు రూ. 50 వేలు విలువ కట్టారు. ఈ విషయం తెలుసుకున్న రషీద్.. పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు.  అయితే శనివారం కొందరు నేరస్థులు షాపుర్‌కు వచ్చినట్లు ఇన్‌ఫార్మర్‌ నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఎస్‌వోజీ బృందం వారిని గాలించారు.  సోరం-గోయ్లా రోడ్డు పై  దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపగా నిందితుడు రషీద్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే షాపుర్‌లోని సీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే నిందితుడు మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.