
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శనివారం (అక్టోబర్ 7న) ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.
ఇజ్రాయిల్, గాజా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయులను రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం ఏర్పడటంతో ఇండియన్స్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అక్కడి అధికారులు సూచించే భద్రతా ప్రొటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించింది. అక్కడి అధికారులతో నిత్యం టచ్ లో ఉండాలని కోరింది. అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఈమెయిల్‌లో సంప్రదించాలని ఎంబసీ అధికారులు పౌరులను కోరారు.
ఇజ్రాయిల్‌పై గాజా రాకెట్లతో దాడికి దిగడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము యుద్ధంలో ఉన్నామని, ఈ వార్ లో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హమాస్ రాకెట్లతో దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇజ్రాయిల్ పౌరులపై హమాస్ ఆకస్మిక దాడి ప్రారంభించిందని చెప్పారు.
ఇజ్రాయిల్, గాజాల మధ్య కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయిల్ పై కేవలం 20 నిమిషాల సమయంలో గాజా 5 వేల రాకెట్లను శనివారం (అక్టోబర్ 7న) ప్రయోగించింది. అదే టైంలో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో చొరబాడ్డారు. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్ సైన్యం సైతం ప్రతిదాడికి దిగింది.