చర్చలకు పిలవకపోతే.. పల్లెల్లో నీళ్లు, కరెంట్ బంజేస్తం

చర్చలకు పిలవకపోతే.. పల్లెల్లో నీళ్లు, కరెంట్ బంజేస్తం
  • సమస్యలు పరిష్కరించాలనిజీపీ కార్మికుల జేఏసీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ(జీపీ) కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మిక సంఘాలను చర్చలకు పిలవా లని జీపీ కార్మికుల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేయటంతో పాటు, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జీపీ కార్మికుల జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ,టీజీకేబీయూ, ఐఎఫ్​టీయూ) నేతలు యజ్ఞ నారాయణ, భాస్కర్, చాగంటి వెంకటయ్యతో పాటు పలువురు నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చర్చలకు పిలవకుండా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై జేఏసీ నేతలు మండిపడ్డారు. 

17 డిమాండ్లతో ఇచ్చిన సమ్మె నోటీసుపై చర్చించి పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.19వేలు చెల్లించాలనే డిమాండ్లతో తాము ప్రభుత్వానికి నోటీసిచ్చామని నేతలు పేర్కొన్నారు. ఈ నెల 18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు చేసి ఎమ్మెల్యేలలకు వినతిపత్రాలు అందచేయాలని, 19న మండల కేంద్రాల్లో ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. 21న కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని వెల్లడించారు. 21 తరువాత గ్రామాల్లో నీటి సరఫరా, కరెంట్ సప్లయ్ ఆపేస్తామని నేతలు హెచ్చరించారు.