నకిలీ ఆర్మీ మేజర్ పెళ్లిళ్లు.. 17 మంది నుంచి రూ. 8 కోట్లు వసూలు

నకిలీ ఆర్మీ మేజర్ పెళ్లిళ్లు.. 17 మంది నుంచి రూ. 8 కోట్లు వసూలు
  • వరంగల్ లోని ఓ ఫ్యామిలీ నుంచి రూ.2 కోట్లు వసూళ్లు
  • ఇవాళే ఎంగేజ్ మెంట్… పోలీసుల ఇన్ఫర్మేషన్ తో రద్దు
  • మూడేళ్లుగా ఇదే తరహా మోసాలుచేస్తున్న వ్యక్తి అరెస్ట్
  • ఆర్మీ మేజర్ నంటూ పెళ్లిలకు సిద్ధం..

హైదరాబాద్‌, వెలుగు: ఆర్మీ మేజర్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘరానా చీటర్ ను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.85,000 క్యాష్‌, 3 డమ్మీ పిస్టల్స్‌, పెల్లెట్స్‌, మూడ్లు లగ్జరీ కార్లు, ఆర్మీ యూనిఫాం, ఫేక్ సర్టిఫికెట్లు, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయంటూ వివరాలను హైదరాబాద్ సీవీ అంజనీకుమార్ వెల్లడించారు. ఏపీ ప్రకాశం జిల్లా కెల్లంపల్లి పాలుకురల్లా తండాకు చెందిన ముదావత్‌ శ్రీను నాయక్‌  అలియాస్‌ శ్రీనివాస్‌ చౌహన్‌(42) తొమ్మిదో క్లాస్​ చదవాడు. కానీ పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్లు, ఆర్మీ మేజర్ నంటూ ఫేక్ ఐడీ క్రియేట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నాడు. గతంలో జవహర్ నగర్, వరంగల్ లో కేసులు నమోదవటంతో పాత క్రైమ్ హిస్టరీ ఆధారంగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుని పై నిఘా పెట్టి మళ్లీ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారని సీపీ అంజనీకుమార్ చెప్పారు.

పెళ్లి చేసుకుంటానని రూ. 2 కోట్లు వసూలు

మ్యాట్రిమోని సైట్ లో ఆర్మీ మేజర్ నంటూ పరిచయం చేసుకొని వరంగల్ చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ ఫ్యామిలీ నుంచి రూ. 2 కోట్లు వసూలు చేశాడు. ఆదివారం ఎంగేజ్ మెంట్ కూడా పెట్టుకున్నారు. అయితే శనివారమే శ్రీనివాస్ చౌహన్ గురించి పోలీసులు ఆ ఫ్యామిలీకి ఇన్ ఫాం చేయటంతో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. మూడేళ్లలో ఇలా 17 మంది దగ్గర నుంచి రూ. 8 కోట్లకు పైగా వసూలు చేశాడు. ఇతని బాధితుల్లో సెక్రటేరియట్ ఎంప్లాయి కూడా ఉన్నారు. ఆమె కూతురును పెండ్లి చేసుకుంటానని చెప్పి రూ. 56 లక్షలు, హైదరాబాద్ కు చెందిన ఎంబీబీఎస్ స్టూడెంట్ ఫ్యామిలీ నుంచి పెళ్లి పేరుతో రూ. 52 లక్షలు, ఖరగ్ పూర్ ఐఐటీ స్టూడెంట్ ఫ్యామిలీ దగ్గర రూ.70 లక్షలు కొట్టేశాడు.