
రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయిన తొలి ఆలయం
గుడి అభివృద్ధికి సెంట్రల్ ఫండ్స్
80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
దక్షిణ కాశీగా పేరొందిన అలంపూర్‌లోని జోగులాంబ శక్తి పీఠాన్ని పిలిగ్రిమేజ్ రెజువెనేషన్, స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్‌లోకి కేంద్ర ప్రభుత్వం చేర్చింది. జోగులాంబ అమ్మవారి ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న పలు టెంపుల్స్‌లో సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి, కోట్లాది రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేస్తోంది. ఇటీవల అష్టాదశ(18) శక్తి పీఠాలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఎంపిక చేసింది. అలంపూర్‌లో చేపట్టాల్సిన పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో గత నెలలోనే రాష్ట్ర టూరిజం అధికారులు డీపీఆర్ సమర్పించారు.
ముఖద్వారం..
తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అలంపూర్ దేవాలయం.. ఏపీలోని శ్రీశైలం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం, సిద్ధవటం ఆలయాలకు ముఖద్వారంగా పేరొందింది. మంత్రాలయం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు తప్పనిసరిగా జోగులాంబ అమ్మవారిని సందర్శిస్తుంటారు. ఈ ఆలయానికి దగ్గర్లోనే 23 ఆలయాలతో కూడిన పాపనాసి ఆలయం, నవబ్రహ్మ ఆలయం, కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ స్థలంలో సంగమేశ్వరాలయం, మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయం, కృష్ణ పుష్కర్ ఘాట్‌ఉన్నాయి.
ఏటా 12 లక్షల మంది
అలంపూర్‌ను రోజుకు సగటున 2వేల మంది సందర్శిస్తుంటారు. వీకెండ్‌లో మాత్రం ఈ సంఖ్య 6,500 వరకు ఉంటుంది. ఇలా ఏటా 12 లక్షల మందికి పైగా భక్తులు సందర్శిస్తున్నారు. 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల్లో 24 లక్షల మంది సందర్శించారని టూరిజం శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే తుంగభద్ర పుష్కరాలకు కూడా సుమారు 21 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
టూరిజం శాఖ ప్రతిపాదనలివే..
ప్రసాద్ స్కీమ్‌లో వచ్చే నిధులతో అలంపూర్‌లో సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కొత్త బ్రిడ్జి, రోడ్ల నిర్మాణంతోపాటు జోగులాంబ, నవబ్రహ్మ ఆలయ పరిసరాలు, సంగమేశ్వరాలయం, పాపనాసి ఆలయం, కృష్ణా పుష్కర్‌ఘాట్, మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సౌకర్యాలు, వైఫై ఏర్పాటుకు రూ.79.96 కోట్లు అవసరమని నివేదిక సమర్పించింది.
త్వరలో కేంద్ర బృందం రాక
అలంపూర్‌తోపాటు పరిసర ఆలయాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రానికి రానున్నట్లు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ మనోహర్ వెల్లడించారు. టీఎస్‌టీడీసీ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన పనులను ఫైనల్ చేస్తారని తెలిపారు. ఈ బృందం పర్యటించి వెళ్లాక నిధులపై క్లారిటీ వస్తుందని చెప్పారు.