
మహాత్మాగాంధీగా లోకానికి తెలిసిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ1869 అక్టోబర్ 2న పశ్చిమ గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు. వాళ్ల కుటుంబంలో ఆయనే చిన్నవాడు. తల్లికి గాంధీ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఏడేండ్ల వయసులోనే నిశ్చితార్థం,13వ ఏటనే పెండ్లి జరిగింది. అప్పటికే చదువుకుంటున్న ఆయన మెడిసిన్ చేయాలనుకున్నారు.
కానీ, తన కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. దాంతో వాళ్లు చెప్పినట్టే ‘లా’ చదవడానికి 17 ఏట ఇంగ్లాండ్ వెళ్లాడు. ఆయనకు వైద్యం మీద ఉన్న ఇష్టంతో రకరకాల ప్రకృతి చికిత్సా విధానాలను స్టడీ చేసి, వాటిని తనతోపాటు ఇతరుల మీద ప్రయోగం చేశాడు. ఇంగ్లాండ్‌లో ఉండలేక మానసికంగా కృంగిపోయాడు. కానీ, తిరిగి వెళ్లడం పిరికితనం అనుకుని అక్కడే ఉండిపోయాడు.
మనం వేసుకునే దుస్తులే మన మనసేంటో తెలియజేస్తాయి అని నమ్మేవాడు. తనను తాను బీదవాడిగా గుర్తించి, అలాంటి దుస్తులు ధరించాడు. ఆ తర్వాత ఫుడ్ సైన్స్ మీద దృష్టిసారించాడు. అదే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో ప్రచారకర్తగా మారాడు. చదువు పూర్తయ్యాక ఇండియాకు తిరిగి వచ్చాడు. రావడంతోనే వాళ్లమ్మ చనిపోయి కొంతకాలమైందనే చేదు నిజం తెలిసింది.
ఆ బాధలో ఉన్న ఆయనకు మరో దెబ్బ తగిలింది. విదేశీయానం చేసి వచ్చినందుకుగాను సంప్రదాయకరమైన శుద్ధిక్రియలు చేసినప్పటికీ ఆయన్ను కుల బహిష్కరణ చేశారు. అక్కడినుంచి వెళ్లిన గాంధీ బొంబాయి కోర్టులలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అయితే నలుగురిలో మాట్లాడటానికి మొహమాటపడే ఆయన మొదటి కేసు సరిగా వాదించలేక తనను రిలీవ్ చేయమని కోరి, అవమానంతో బయటకొచ్చాడు.
►ALSO READ | ఆటోమేటిక్ గొడుగు.. వర్షం వస్తే దానికదే ఓపెన్ అవుతుంది.. ఎంత గాలి వచ్చినా విరగదు కూడా !
తనను తాను శారీరకంగా, మానసికంగా కంట్రోల్ చేసుకునేవరకు కోర్టు మెట్లు ఎక్కనని ఒట్టుపెట్టుకున్నాడు. అయితే కుటుంబ పోషణ కోసం రాజ్ కోటకు తిరిగి వెళ్లి, తన సోదరుడు చేస్తున్న చిన్న లీగల్ బిజినెస్‌లో సహాయకుడిగా చేరాడు. అక్కడ ఉన్నప్పుడే ఆయనకు మొదటి సంతానం కలిగింది. ఇలా ఉండగా ఒక కమిషన్, దక్షిణాఫ్రికాలో పెండింగ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన కేసులో తనను ఫర్మ్ ప్రతినిధిగా ఒక ఏడాదిపాటు ఉండాలని పిలుపొచ్చింది. అది విధి ఆయన కోసం ఏర్పరిచిన బాటలో మొదటి అడుగు.
1901లో గాంధీ చేసిన సేవలకుగాను ఖరీదైన బహుమతులు ఇచ్చారు. కానీ వాటన్నింటినీ వద్దనుకుని తిరిగి ఇండియాకి వచ్చి బొంబాయిలో ఉన్నాడు. కొద్దిరోజుల్లోనే మళ్లీ పిలుపు రావడంతో దక్షిణాఫ్రికాకు ఇండియన్ డిప్యుటేషన్‌ను వెంటపెట్టుకుని వెళ్లాడు. గాంధీ ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలందించి దానికి తానే గౌరవ సెక్రటరీ అయ్యాడు.
ఎన్నో మెమోరియల్స్కు డ్రాఫ్ట్స్‌మెన్ అయ్యాడు. 1904లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు తన ఆఫీసు మూసివేసి పారిశుద్ధ్య పనికే అంకితమయ్యాడు.1915లో ఇండియాకు వచ్చిన ఆయన గోఖలేకు ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిపాటు మాతృదేశ పర్యటన చేశాడు. అప్పటికే ఆయన గొప్పతనం భారతీయుల హృదయాల్లో చోటు సంపాదించేలా చేసింది.
ప్రజలు ఆయనకు ‘మహాత్మ’ అనే బిరుదు ఇచ్చారు. ఆ పర్యటన తర్వాత మొదట అహ్మదాబాద్‌లో ఒక ఆశ్రమం కట్టాడు. ఆ తర్వాత ప్రజల కోసం మరెన్నో పోరాటాలు, సత్యాగ్రహం, మాస్ ఎడ్యుకేషన్ వంటి ఉద్యమాలు చేశాడు. ఈ క్రమంలో జైలు పాలయ్యాడు. విడుదలయ్యాక కూడా దేశం కోసం తన సేవలు కొనసాగించాడు. -మేకల మదన్మోహన్ రావుకవి, రచయిత