మ్యాచ్ రద్దయినా..ఫ్యాన్స్ హ్యాపీ..!

మ్యాచ్ రద్దయినా..ఫ్యాన్స్  హ్యాపీ..!

ఐదు మ్యాచుల్లో భారత్ -సౌతాఫ్రికా చెరో రెండు గేమ్స్ గెలిచాయి. ఇక చివరి మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనుకుంటే..అది కాస్తా వర్షార్పణమైంది. బెంగుళూరులో నాన్ స్టాప్గా వర్షం కురవడంతో చివరకు మ్యాచ్ను రద్దుచేశారు. వాన కారణంగా మ్యాచ్ లేట్గా మొదలైంది. ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన భారత్..3.3 ఓవర్లలో 2  వికెట్లకు 28 పరుగులు చేసింది.  అయితే ఈ సమయంలో  వర్షం మళ్లీ మొదలైంది.  ఎంతకూ వర్షం ఆగకపోవడంతో..చివరకు చేసేదేమి లేక మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్లో రెండు జట్లు 2-2తో  సమంగా నిలిచాయి. 

సిరీస్ను  డిసైడ్ చేసే మ్యాచ్ కావడంతో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం ఫ్యాన్స్తో నిండిపోయింది. రసవత్తరంగా సాగుతుందని భావించి..స్టేడియానికి పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో నిరాశ చెందారు. టీ20 మ్యాచ్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి వరుణుడు ఆటంకం కలిగించాడు. వాన వల్ల మ్యాచ్ ఆగిపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. 

మ్యాచ్ రద్దుతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ డబ్బుల్లో 50 శాతం మొత్తాన్ని రీఫండ్ చేస్తామని వెల్లడించింది. మ్యాచ్ అర్దాంతరంగా రద్దుకావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. అయితే నిబంధనల ప్రకారం మ్యాచ్ లో ఒక్క బాల్ పడిన తర్వాత మ్యాచ్ రద్దయితే డబ్బులు చెల్లించనవసరం లేదు. బంతి పడకుండా రద్దయితే మాత్రం ప్రేక్షకులకు డబ్బులు చెల్సించాల్సిందే. అయితే దీనికి భిన్నంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎంతో ఆశతో మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులు రద్దు కారణంగా తీవ్ర నిరాశకు గురికావడంతో వారికి ఊరట కలిగించేందుకు టికెట్ మొత్తంలో సగం చెల్లించాలని నిర్ణయించింది.