ఢిల్లీలో ప్రమాదరకంగా పొల్యూషన్ 

ఢిల్లీలో ప్రమాదరకంగా పొల్యూషన్ 

ఢిల్లీలో గాలి కాలుష్యం డేంజర్ లెవెల్​కు చేరింది. దీంతో  కేజ్రీవాల్ సర్కారు కట్టడి చర్యలు మొదలు పెట్టింది. కాలుష్యానికి కారణమవుతున్న పనులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. నిర్మాణ పనులు, కూల్చివేతలు ఆపేయాలని ఆదేశాలివ్వడంతోపాటు  శనివారం నుంచి ఢిల్లీలోని ప్రైమరీ స్కూళ్లన్నింటినీ మూసేయాలని ఆదేశించింది. సీనియర్ స్టూడెంట్లకు ఔట్‌డోర్ యాక్టివిటీస్‌ను తగ్గించాలని సూచించింది. సగం మంది ప్రభుత్వ ఉద్యోగులు వర్క్​ఫ్రమ్ హోం చేయాలని, దీనివల్ల రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గుతుందని వెల్లడించింది. ప్రైవేటు కంపెనీల్లో పని చేసేవాళ్లకూ తొందరలోనే అడ్వైజరీ జారీ చేయనున్నారు. వాహనాలకు సరి‑ బేసి రొటేషన్ విధానాన్ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

న్యూఢిల్లీ : రోజురోజుకు ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతోంది. శుక్రవారం ఉదయానికి ఎన్సీఆర్ పరిధిలో గాలి డేంజర్ లెవెల్​కు చేరుకోవడంతో కేజ్రీవాల్ సర్కారు కట్టడి చర్యలు మొదలు పెట్టింది. కాలుష్యానికి కారణమవుతున్న పనులపై టెంపరరీగా నిషేధం విధించింది. ఇప్పటికే ఢిల్లీలో నిర్మాణ పనులు, కూల్చివేతలు ఆపేయాలని ఆదేశాలిచ్చిన సర్కారు.. శనివారం నుంచి ఢిల్లీలోని ప్రైమరీ స్కూళ్లన్నింటినీ మూసేయాలని ఆదేశించింది. సీనియర్ స్టూడెంట్లకు ఔట్‌‌డోర్ యాక్టివిటీస్‌‌ను తగ్గించాలని స్కూళ్లకు చెప్పింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్​ రాయ్​ ప్రభుత్వ నిర్ణయాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులలో సగం మందికి ఇంటి నుంచే పనిచేయాలని, దీనివల్ల ప్రజా రవాణా కొంతమేర తగ్గుతుందని, రోడ్లపైకెక్కే వాహనాల సంఖ్య కూడా తగ్గుతుందని మంత్రి చెప్పారు. ప్రైవేటు కంపెనీల్లో పని చేసేవాళ్లకూ తొందరలోనే అడ్వైజరీ జారీ చేస్తామన్నారు. వాహనాలకు సరి– బేసి రొటేషన్ విధానాన్ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు. ‘‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌మెంట్ కమిషన్ సిఫార్సులను బట్టి కాలుష్యం కట్టడి చేసేందుకు కండిషన్లు పెట్టాలని నిర్ణయించినం. నాన్ బీఎస్ 6 డీజిల్ లైట్ వెహికల్స్‌‌పై బ్యాన్ విధిస్తున్నం. సోమవారం నుంచి 50% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇండ్ల దగ్గరి నుంచే పని చేయాలి” అని మంత్రి చెప్పారు. ఈ చర్యల అమలును పర్యవేక్షించేందుకు రవాణాశాఖ ప్రత్యేక కమిషనర్‌‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ప్యానెల్‌‌ను ఏర్పాటు చేసినట్లు రాయ్‌‌ తెలిపారు. హాట్‌‌స్పాట్‌‌లలో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌‌ఫోర్స్‌‌లను ఏర్పాటు చేస్తామని, 13 బృందాలు పారిశ్రామిక ప్రాంతాలను పర్యవేక్షిస్తాయని తెలిపారు.

గడ్డి కాల్చివేతకు బాధ్యత మాదే : కేజ్రీవాల్

పంజాబ్​లోనూ ఆప్ ప్రభుత్వం ఉంది కాబట్టి.. అక్కడి పంట పొలాల్లో గడ్డి కాల్చివేతకు పూర్తి బాధ్యత తమదేనని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం అంగీకరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్​తో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే చలికాలం నాటికి ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, పొల్యూషన్ ఢిల్లీ సమస్య మాత్రమే కాదని, నార్త్ లోని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్‌‌లోని చాలా సిటీల్లో కాలుష్యం సివియర్​గా నమోదవుతోందన్నారు. ‘‘ఎయిర్ క్వాలిటీ పడిపోవడానికి ఒక్క పంజాబో, ఢిల్లీనో కారణం కాదు. ఇది నిందించుకునే సమయం కాదు. పొల్యూషన్  సమస్యపై బ్లేమ్​ గేమ్, రాజకీయాలు ఉండకూడదు. పరిష్కారాన్ని కనుక్కోవాలి” అని కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో పొల్యూషన్​కు పంజాబ్​ రైతులనే బాధ్యులను చేయడం సరికాదన్నారు. వాళ్లకు సొల్యూషన్ కావాలన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయిందని, ఒక్క ఏడాదిలో ఈ సమస్యకు ముగింపు చెప్తామని కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల సీఎంలతో కేంద్రం చర్చించాలని, పంజాబ్​లో పంట కాల్చకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని భగవంత్ మాన్ అన్నారు.

రోగాల బారిన పడటం ఖాయం

ఢిల్లీలో గాలి నాణ్యత ‘సివియర్’​ కేటగిరీలో కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఎక్యూఐ 445 గా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఈ లెవెల్​లో ఉందంటే ఆరోగ్యంగా ఉన్న జనాలే రోగాల బారిన పడొచ్చని, అనారోగ్యంతో ఉన్నోళ్లు ఇంకింత సీరియస్​ కండిషన్​లోకి వెళ్తారని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు.