లంచం ఇవ్వలేదని భూములు లాక్కున్రు

లంచం ఇవ్వలేదని భూములు లాక్కున్రు

డ్రుగొండ, వెలుగు: లంచం ఇవ్వలేదని తాము సాగు చేస్తున్న పోడు భూములను ప్లాంటేషన్​ కోసం లాక్కున్నారని భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పోడు రైతులు చండ్రుగొండ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రావికంపాడు రైతువేదికలో ఆఫీసర్లు పోడు హక్కుల రక్షణ కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీఓ అన్నపూర్ణ, ఎంపీఓ తులసీరాం, డీటీ ప్రసన్న, ఎఫ్ఎస్ఓ రామారావు పాల్గొని పోడుహక్కుపై అవగాహన కల్పించారు. ఆఫీసర్లు మాట్లాడుతుండగా స్టేజీపై కూర్చున్న చండ్రుగొండ రేంజ్​ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామారావుతో పోడు రైతులు వాగ్వివాదానికి దిగారు.

లంచం ఇవ్వలేదనే కోపంతో తాము సాగు చేస్తున్న 40 ఎకరాల భూమిని ప్లాంటేషన్ కోసం లాక్కొన్నారని రైతులు బాణోతు బాలు, శ్రీను, ఈర్యా, లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.15వేలు చొప్పున తీసుకుని మా పొలాల పక్కన ఉన్న భూములను వదిలేశారని ఆరోపించారు. వాటిలో ఎందుకు ప్లాంటేషన్​చేపట్టలేదని నిలదీశారు. పలువురు నాయకులు, ఆఫీసర్లు పోడుదారులను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. ఆ వెంటనే ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఆఫీసర్లు వెళ్లిన కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన జడ్పీటీసీ వెంకటరెడ్డి అవగాహన సదస్సుపై తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రొటోకాల్ పాటించరా అని ఫైర్ అయ్యారు. విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.