ఇయ్యాల నిజాం మనవడు ముకరంజా అంత్యక్రియలు

ఇయ్యాల నిజాం మనవడు ముకరంజా అంత్యక్రియలు
  • ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు చేరిన డెడ్​బాడీ
  • చౌమహల్లా ప్యాలెస్​లో నివాళులర్పించిన సీఎం కేసీఆర్ 

హైదరాబాద్, వెలుగు: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ముకరంజా బహదూర్ అంత్యక్రియలు బుధవారం మక్కా మసీదులో జరగనున్నాయి.  ఈ నెల 14న టర్కీలోని  ఇస్తాంబుల్ లో ముకరంజా కన్నుమూసిన విషయం తెలిసిందే. ముకరంజా డెడ్​బాడీని మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్​తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి చౌమహల్లా ప్యాలెస్ కి తరలించారు. అక్కడ నిజాం కుటుంబ సభ్యులు,  ప్రముఖులు నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి వరకు ప్రజల సందర్శనకు ప్యాలెస్ లోకి అనుమతించనున్నారు.  ఆ తర్వాత మక్కా మసీదులోని అసఫ్ జాహీల సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నిజాం కుటుంబ సభ్యులు  తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ముకరంజా సేవలు మరువలేనివి: కేసీఆర్ 

చివరి నిజాం రాజు ముకరంజా పార్థివదేహానికి మంగళవారం సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ముకరంజా డెడ్​బాడీ చౌమహల్లా ప్యాలెస్ కి చేరుకున్న వెంటనే కేసీఆర్ వెళ్లి నివాళుర్పించి ఆయన కుటుంబసభ్యులను  పరామర్శించారు. ముకరంజా సేవలు మరువలేనివని కొనియాడారు. సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు నివాళులర్పించారు. నిజాం వారసుడిగా, పేదల కోసం విద్య, వైద్య రంగాల్లో ముకరంజా చేసిన సామాజిక సేవలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు.