అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాలు సరిగా అమలు చెయ్యాలి

అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాలు సరిగా అమలు చెయ్యాలి

హైదరాబాద్: ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాల అమలు సరిగా జరగాలని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. శ‌నివారం నాగోల్ లో రాచకొండ పోలీసులు, రాచకొండ సెక్యురిటి కౌన్సిల్ ఆధ్వర్యంలో సంఘమిత్ర సర్టిఫికేషన్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి MLC కవిత, రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఇతర పోలీసు అధికారులు హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. అడబిడ్డలకు గౌరవం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. తెలంగాణ లో మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 40 శాతం హింసని ఇళ్ళల్లోనే ఎదుర్కొంటున్నారని..కడుపులో ఉన్నప్పటి నుండే అడబిడ్డలపైన దౌర్జన్యం జరుగుతోందని ఆమె అన్నారు. మహిళలు అంతా సంఘటితం అయ్యి తమ సమస్యలను ఎదుర్కోవాలని.. మహిళలను మనుషులుగా చూడాలన్నారు

తెలంగాణ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామ‌ని చెప్పారు క‌విత‌. కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన షీ టీమ్స్ అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. షీ టీమ్స్ తో పాటు సంఘమిత్ర కార్యక్రమాలు చేయడం అభినందనీయమ‌ని, సంఘమిత్ర లు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం ని కోరుతాన‌న్నారు.

దేశవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన హజీపూర్ ఘటన త‌ర్వాత మళ్ళీ అలాంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించిన సీపీ మహేశ్ భగవత్ ని అభినందిస్తున్నామ‌ని ఆమె అన్నారు. త‌న‌ను కూడా సంఘమిత్ర లో జాయిన్ చేసుకోవాలని సీపీ ని కోరారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సంఘమిత్ర లకు ఆమె సర్టిఫికేట్స్ ఇచ్చారు.

స్వాతంత్య్రం వచ్చిందా? లేదా? అని అనిపిస్తుంది: సీపీ

మహిళ పైన అన్యాయాలు, అత్యాచారాలు ఇంకా జరుగుతున్నాయని, నిర్భయ చట్టం వచ్చిన కూడా మహిళల పై అత్యాచారాలు అగట్లేదని సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ అన్నారు. మహిళలపై జరిగే కొన్ని అన్యాయాలు చూస్తుంటే మనకి స్వాతంత్య్రం వచ్చిందా లేదా అనిపిస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విదేశీ వరకట్న కేసులు కూడా పెరిగిపోతున్నాయని,  చదువుకున్న వారు కూడా మహిళలను వేధిస్తున్నారని ఆయ‌న తెలిపారు. వరకట్న నిషేధ చట్టం వచ్చి 60 ఏళ్ళు గడిచినా ఇంకా వరకట్న వేధింపులు అగట్లేదని అన్నారు.

బాధిత మహిళలందరికి మేము ఉన్నాం అని సంఘమిత్ర లు ముందుకు రావాలని, సమాజంలో ఉన్న బాధిత మహిళలకు పోలీసులకు మధ్య సమన్వయ కర్తలుగా సంఘమిత్ర లు ఉంటారన్నారు. డయల్ 100 కి కాల్ చేస్తే 7 నిమిషాల్లో మా పోలీసులు మీ ముందు ఉంటారన్నారు.