అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీలో డిమాండ్

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీలో డిమాండ్
  • ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్ స్థానాల్లో 20 నుంచి 25 మంది క్యూ
  • ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి
  • ప్రతి స్థానం నుంచి పాత, కొత్త లీడర్ల మధ్య పోటాపోటీ

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచేందుకు లీడర్లు పోటీ పడుతున్నారు. గతంలో చాలా అసెంబ్లీ సీట్లలో పార్టీకి అభ్యర్థులు దొరకడమే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లోనైతే 25 మంది వరకు పోటీకి ఇంట్రస్ట్​ చూపుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆశావహుల నుంచి రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ దరఖాస్తులు తీసుకుంది. అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు అప్లయ్​ చేసుకున్నారు. కొన్ని సెగ్మెంట్లలోనైతే  రెండంకెల వరకు దరఖాస్తులు రాగా.. చాలా నియోజకవర్గాల్లో ఐదు నుంచి పది వరకు అప్లికేషన్లు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నీ తరుణ్​చుగ్​ ఆధీనంలో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలో  చేరడం, బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే వాతావరణం ఏర్పడడంతోనే పోటీదారుల సంఖ్య పెరిగిందని నేతలు అంటున్నారు. 

ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనేది వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓ లిస్టు రెడీ చేసి..  త్వరలో జరుగనున్న పార్టీ కోర్ కమిటీ మీటింగ్ ముందు ఉంచుతుంది. ఆ తర్వాత లిస్ట్ ను సార్ట్ అవుట్ చేసి హైకమాండ్ కు పంపిస్తుంది. దీని ఆధారంగా.. బరిలో నిలిచేందుకు దరఖాస్తు చేసుకున్న వారిపై ఢిల్లీ పెద్దలు మరో సర్వే చేయిస్తారు. ఇప్పటికే  బీజేపీ జాతీయ నాయకత్వం పలుసార్లు నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితిపై ఎక్స్ పర్ట్స్​తో సర్వేలు చేయించింది. ప్రస్తుతం కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులతో నియోజకవర్గాల వారీగా పార్టీ బలా బలాలపై సర్వే చేయిస్తున్నది. దరఖాస్తు చేసుకున్న పోటీదారులపై కూడా సర్వే చేయించే అవకాశం ఉందని పార్టీ రాష్ట్ర వ్యవహారాలను చూసే ఓ ముఖ్య నేత చెప్పారు

ఎక్కువ దరఖాస్తులు ఎక్కడి నుంచి అంటే..!

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ అప్లికేషన్లు హైదరాబాద్, దాని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచే ఉన్నాయి. అత్యధికంగా ముషీరాబాద్,  ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో 20 నుంచి 25 అప్లికేషన్లు వచ్చాయని అంటున్నారు. ఈ సెగ్మెంట్ల పరిధిలోని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎక్కువగా బీజేపీ వాళ్లే కావడం,  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ హవా కొనసాగడంతో ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు లీడర్లు ఎక్కువ ఇంట్రస్ట్​ చూపుతున్నారు. పైగా ఈ నియోజకవర్గాల్లో చాలా మంది ఇతర పార్టీల సీనియర్ నేతలు బీజేపీలోకి రావడంతో పోటీ మరింత ఎక్కువైంది. బీజేపీ తరఫున ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్​, సోయం బాపూరావు  పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ బాగానే ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్  జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లలో పాత, కొత్త నేతలు బరిలో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.